
హైదరాబాద్: ఐపీఎల్ 2018 ప్రథమార్థంలో వరుస విజయాలతో ఊపుమీదున్నట్లు కనిపించిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ద్వితీయార్థానికి వచ్చేసరికి వరుస వైఫల్యాలతో చతికిలపడింది. సీజన్ ఆరంభంలో ఆరింటికి ఐదు మ్యాచ్‌లలో గెలిచి అత్యుత్తమ ఫామ్‌లో కనిపించిన పంజాబ్.. దాదాపు ప్లేఆఫ్‌కు ముందు అదే జట్టు ఎన్నికవుతుందనిపించింది. కానీ, తర్వాత నుంచి అనూహ్య రీతిలో గెలిచే మ్యాచ్‌లను కూడా చేజేతులా కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
అయితే జట్టు ప్రదర్శన ఎలా ఉన్నా.. మెంటార్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడిని స్వేచ్ఛగా ఆడేలా ప్రోత్సహించినట్లు పంజాబ్ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్.. 'టోర్నీలో భాగంగా నేను సెహ్వాగ్‌తో చాలాసార్లు మాట్లాడాను. అతను ఆటను ఎంతో సులభంగా మార్చేవాడు. మిగతా ఆటగాళ్లను కూడా అదేవిధంగా ఆడాలంటూ సలహాలు ఇచ్చేవాడు. ఆత్మస్థైర్యాన్ని నమ్ముకొని బరిలోకి దిగాలని.. ముఖంపై చిరునవ్వుతో ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని సూచించాడు' అని తెలిపాడు.
సెహ్వాగ్ చెప్పిన మాటలకు ఏకీభవిస్తూ.. 'ఈ స్వేచ్ఛ కేవలం నాకు మాత్రమే కాదు. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి ఇస్తుండేవాడని, ఒక జట్టుగా ఆడాలంటే మనకు కావాల్సింది ఇలాంటి బ్రాండ్ క్రికెటే. ఫలితం గురించి ఆలోచించకుండా ఎంతో ధైర్యంగా, దూకుడుగా ఆడటానికే ప్రాధాన్యతనివ్వాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో ఒక్కోసారి ఇది సాధ్యపడుతుంది. కొన్ని సార్లు కుదరదు కూడా.. అయినా అలాగే ముందుకు సాగుతుండాలని' ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ చెప్పుకొచ్చాడు.
పంజాబ్ కెప్టెన్ అశ్విన్ గురించి మాట్లాడుతూ.. అతనెంతో గొప్ప ఆటగాడు, ప్రతి ఆటగాడు నిర్భయంగా, సహజ స్వభావంతో ఆడాలని కోరుకునేవాడని ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ రాహుల్ పేర్కొన్నాడు.