హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ట్వీట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సెహ్వాగ్ తన స్నేహితుడు చేసిన ఓ చిన్నపని గురించి అభిమానులకు వివరించాడు.
మీ ఇంట్లో బ్రెడ్ ప్యాకెట్ మరో పావు గంటలో ఎక్స్‌పైర్ అవుతుందా? మీకెవరికైనా తెలుసా ఆ సమయంలో ఇలా చేయవచ్చని? అంటూ సెహ్వాగ్ తన స్నేహితుడి ఇంట్లో చోటు చేసుకున్న సంఘటన గురించి అభిమానుల కోసం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
ఒక రోజు సెహ్వాగ్ తన స్నేహితుడి అపార్ట్‌మెంట్‌కి వెళ్లాడు. రాత్రి 11:45 గంటల సమయంలో ఇంట్లోని వంట గదిలో నుంచి ఏదో చప్పుడు వస్తున్నట్లు గుర్తించిన సెహ్వాగ్ ఏం జరుగుతుందో తెలుసుకుందామని అక్కడకు వెళ్లాడు. తీరా చూస్తే అతని స్నేహితుడు బ్రెడ్ తింటూ కనిపించాడు.
ఇంత రాత్రి సమయంలో బ్రెడ్ ఎందుకు తింటున్నావు అని సెహ్వాగ్ ప్రశ్నించాడు. దీనికి అతని స్నేహితుడు మరో 15 నిమిషాల్లో బ్రెడ్ ప్యాకెట్ గడువు అయిపోతుంది. అందుకే ఇప్పుడే తింటున్నాను అని చెప్పాడు. తన స్నేహితుడు ఇచ్చిన సమాధానంతో సెహ్వాగ్ ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నాడు.