హైదరాబాద్: వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖ క్రికెటర్ల పుట్టినరోజులకు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతూ నెటిజన్ల దృష్టిని ఆలరిస్తుంటాడు.
తాజాగా, సెహ్వాగ్ న్యూజిలాండ్ క్రికెటర్ రాస్ టేలర్‌ల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. సెహ్వాగ్ చేసిన ట్వీట్‌కి ధీటుగా రాస్ టేలర్ హిందీలో సమాధానం చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... న్యూజిలాండ్‌తో ఆదివారం వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాస్ టేలర్ 100 బంతుల్లో 95 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీనికి సెహ్వాగ్... టేలర్‌ను అభినందిస్తూ 'చాలా బాగా ఆడావు రాస్ టేలర్ దర్జీ (టేలర్‌ను టైలర్ అంటూ) జీ. దీపావళి సందర్భంగా వచ్చిన ఆర్డర్స్ తో ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దాన్ని అధిగమించావు' అంటూ ట్వీట్ చేశాడు.
దీనికి రాస్ టేలర్ హిందీలో బదులిస్తూ 'ధన్యవాదాలు సెహ్వాగ్. వచ్చే ఏడాది దీపావళికి ఒకవేళ నువ్వు ఆర్డర్ ఇస్తే.. పండుగకు ముందుగానే డెలివరీ చేసేస్తాను' అని పేర్కొన్నాడు.
దీనికి సెహ్వాగ్ 'హ హ హ మాస్టర్ జీ.. ఈ ఏడాది దీపావళికి నేను తీసుకున్న ప్యాంటు చాలా వదులుగా ఉంది. దీన్ని బాగు చేసి వచ్చే ఏడాది దీపావళికి పంపించు. రాస్ ద బాస్' అన్నాడు.
దీనికి టేలర్ 'మీ దర్జీ ఈ దీపావళికి సరిగా కుట్టలేదా' అని ప్రశ్నించాడు. 'నీలా ఉన్నత ప్రమాణాలతో ఎవరూ రాణించలేరు కదా. అది ప్యాంటు కుట్టడంలో అయినా మైదానంలో భాగస్వామ్యం నెలకొల్పడంలోనైనా' అని వీరూ బదులిచ్చాడు.
దీంతో వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. టేలర్ హిందీలో ఎలా బదులిచ్చాడు. అతనికి హిందీ వచ్చా? అంటూ పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో
రాస్ టేలర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.