
హైదరాబాద్: క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. సచిన్ గారాల పట్టి సారా టెండుల్కర్ ప్రఖ్యాత లండన్ యూనివర్సిటీలో మెడిసిన్ డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా శుక్రవారం జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో తల్లీదండ్రులతో కలిసి సారా టెండూల్కర్ పాల్గొంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సచిన్ భార్య అంజలి డాక్టరన్న విషయం తెలిసిందే. సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్, తండ్రి బాటలో నడుస్తూ క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటే, కూతురు సారా మాత్రం తల్లి అంజలిని మార్గదర్శిగా తీసుకుని మెడిసిన్ డిగ్రీ పూర్తి చేసింది.
సారా గ్రాడ్యూయేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్, ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. "నిన్న గాక మొన్న నువ్వు ఇంటిని వదిలి, స్కూల్‌కి వెళ్లినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు నువ్వు ఓ గ్రాడ్యుయేట్‌వి. అంజలి, నేను నిన్ను చూసి చాలా గర్విస్తున్నాం. నువ్వు ఇక ప్రపంచాన్ని చుట్టిరావచ్చేమో" అని సచిన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే సారా టెండూల్కర్‌కు యవతలో మంచి క్రేజ్ ఉంది. సారా అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. తాను డిగ్రీ పట్టా అందుకుంటున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్స్‌తో పంచుకుంది. "ఐ డిడ్ వాట్ (నేనేం చేశాను...)" అంటూ తాను పట్టా అందుకుంటున్న ఫోటోలతో పాటు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలను సారా షేర్ చేసింది.