న్యూఢిల్లీ: భారత బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియాంక చౌదరిని పెళ్లి చేసుకోనున్నాడు. రైనా - ప్రియాంక చౌదరిల పెళ్లి ఏప్రిల్ 3వ తేదీని దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో జరగనుంది. ప్రస్తుతం భారత్ ప్రపంచకప్ ఆడుతోంది.
ప్రపంచ కప్ టోర్నీ మార్చి 29న పూర్తి కానుంది. ఆ తర్వాత భారత జట్టు తిరిగి స్వదేశానికి రానుంది. ఆ తర్వాత రైనా - ప్రియాంకల పెళ్లి జరగనుంది. వీరి రోకా వేడుక మార్చి 12వ తేదీన మీరట్‌లోని గాడ్విన్ హోటల్‌లో జరిగింది.

ప్రియాంక చౌదరి బ్యాంకింగ్ రంగంలో పని చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం నెదర్లాండ్స్‌లో పని చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు ఉత్తర ప్రదేశ్‌లోని బారుట్‌కు చెందిన వారు. ప్రస్తుతం వారు మీరట్‌లో ఉంటున్నారు. ప్రియాంక, రైనాలు చిన్నప్పటి నుండి స్నేహితులు.
వీరిద్దరి కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి స్నేహం ఉంది. వీరి తండ్రులు ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సహోద్యోగులు. కాగా, క్రికెటర్ సురేష్ రైనాకు కమల్ హాసన్ కూతురు శృతి హాసన్‌తో సంబందముందంటూ గతంలో పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే.