
హైదరాబాద్: సఫారీ గడ్డపై గతంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా అద్భుత విజయాలను సాధిస్తోంది. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గత డిసెంబర్ నెలలో సఫారీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైన కోహ్లీసేన మూడో టెస్టు నుంచి పుంజుకున్న తీరు అద్భుతం.
అదే ఆత్మ విశ్వాసంతో ఆరు వన్డేల సిరిస్‌ను 5-1 తేడాతో దక్కించుకుంది. తాజాగా ప్రారంభమైన మూడు టీ20ల సిరిస్‌లోనూ ఆధిక్యం సంపాదించింది. ఆదివారం జోహెన్స్ బర్గ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికాపై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ విజయం అనంతరం టీమిండియా ఆటగాళ్లు గ్రాండ్‌గా పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోని, సురేష్ రైనా, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా తదితరులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను క్రికెటర్లు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.
'గొప్ప విజయం తర్వాత సహచర ఆటగాళ్లతో కలిసి డిన్నర్.. విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాం' అని కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అధికారిక ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ బుధవారం (ఫిబ్రవరి 21)న సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్కులో జరగనుంది.