హైదరాబాద్: మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 10వ సీజన్ ప్రారంభం కానుంది. దేశ, విదేశాలకు చెందిన క్రికెటర్లు ఈ సీజన్‌లో సత్తా చాటేందుకు ఊవిళ్లూరుతున్నారు. ముఖ్యంగా 10వ సీజన్ కోసం భారత్‌కు వచ్చిన విదేశీ క్రికెటర్లు భారత సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చి వారు ఆడుతున్న జట్టుకు మద్దతు తెలపాలని కోరుతున్నారు.
ఇటీవల ముగిసిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరిస్‌లో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్ల మధ్య మాటాల తూటాలు పేలాయి. డీఆర్ఎస్ రివ్యూ వివాదం ఇరు జట్ల మధ్య పెను దుమారాన్నే సృష్టించింది. రాంచీ టెస్టులో కోహ్లీ గాయంపై ఆసీస్ ఆటగాళ్లు ఎగతాళి చేసిన నేపథ్యంలో కోహ్లీ కూడా అదే స్ధాయిలో ధీటుగా సమాధానమిచ్చాడు.
ఇలా నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆటగాళ్లు కొన్ని సార్లు వాగ్వాదానికీ దిగారు. ధర్మశాల టెస్టు అనంతరం ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఆటలో స్లెడ్జింగ్ లాంటివి సహజమే అని, తాను ఆ విధంగా మాట్లాడినందుకు స్మిత్ క్షమాపణలు కూడా కోరిన సంగతి తెలిసిందే.
టెస్టు సిరిస్ ముగియడానికి ముంందు స్టీవ్ స్మిత్‌ని రైజింగ్ పూణె జెయింట్ ప్రాంఛైజీ ధోనిని తప్పంచి అతడి స్ధానంలో కెప్టెన్‌గా నియమించింది. ఈ నేపథ్యంలో పూణె జట్టు కెప్టెన్సీ బాధ్యతలను స్మిత్ నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా జట్టు కోసం స్మిత్ తాజాగా భారత సంప్రదాయ దుస్తులు ధరించి ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
అంతేకాదు మరాఠి భాషలో పుణె జట్టుకు మద్దతు తెలపాలని అభిమానులను కోరాడు. ఈ కార్యక్రమంలో భారత ఆటగాడు రహానె కూడా పాల్గొన్నాడు. సంప్రదాయ దుస్తులను ధరించిన స్మిత్ బ్యాట్ పట్టుకుని రహానెతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.