న్యూఢిల్లీ: టీమిండియాలో మరో కీలక ఆటగాడు పెళ్లి పీఠలెక్కెందుకు సిద్ధమయ్యాడు. భారత జట్టు బౌలింగ్‌లో కీలక భూమిక పోషిస్తున్న ఇషాంత్ శర్మ ఆదివారం ప్రతిమా సింగ్ అనే యువతితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు.
జట్టులో అంతా లంబూ అని పిలుచుకునే ఈ ఫాస్ట్ బౌలర్ కు ప్రస్తుతం జరుగుతున్న జింబాబ్వే పర్యటన నుంచి విశ్రాంతి లభించింది. ఇటీవలే ముగిసిన ఐపీఎల్- 9 సీజన్‌లో రైజింగ్ పుణే సూప్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఇషాంత్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన వేడుకలో తాను ప్రేమించిన యువతి ప్రతిమ వేలికి రింగు తొడిగాడు.

కాగా, వారణాసిలోని శివపూర్ ప్రాంతానికి చెందిన ప్రతిమ.. జాతీయ బాస్కెట్‌బాల్ ప్లేయర్ కావడం విశేషం. ఆమె 2006లో జూనియర్ ఇండియా బాస్కెట్‌బాల్ జట్టుకు ఎంపికయ్యారు. 2008లో జట్టు కెప్టెన్‌కూడా వ్యవహరించారు. 2010లో ఏషియన్ గేమ్స్‌లో పాల్గొన్న భారత జాతీయ జట్టులో సభ్యులుగా ఉన్నారు ప్రతిమ. ఆమె చిన్న సోదరి ప్రియాంక సింగ్ ఎన్ఐహెచ్ కోచ్ కాగా, మరో సోదరి దివ్యా సింగ్ జూనియర్ ఇండియా టీంకు కోచ్‌గా ఉన్నారు. మరో ఇద్దరు సోదరీమణులు ప్రశాంతి, ఆకాంక్ష సింగ్‌లు జాతీయ జట్టుకు ఆడారు.
కాగా, త్వరలోనే ఇషాంత్-ప్రతిమల పెళ్లిని ఘనంగా నిర్వహించనున్నట్లు సమాచారం. ఎంగేజ్ మెంట్ చేసుకున్న లంబూకు జట్టు సభ్యులు రోహిత్ శర్మ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. దంపతుల సమూహంలోకి స్వాగతం అంటూ ఆహ్వానం పలికాడు.