
పూనకమొచ్చినట్లు మొయిన్ అలీ ఇన్నింగ్స్
మొయిన్ అలీ (93పరుగులు 57బంతుల్లో 13ఫోర్లు, 3సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో వీరవిహారం చేసినప్పటికీ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ (2) క్యాచ్ అవుట్ అయ్యాక బరిలోకి దిగిన మొయిన్ అలీ.. పవర్ ప్లేలో దమ్ దమ్ చేశాడు. ప్రసీద్ వేసిన 4వ ఓవర్లో ఫోర్ తో మొదలెట్టిన మొయిన్ ఆ ఓవర్లో మొత్తం 3ఫోర్లు, 1సిక్సర్ కొట్టి తన పవర్ చూపించాడు. ఆ ఓవర్లో 18పరుగులొచ్చాయి. తర్వాత 5వ ఓవర్ అశ్విన్ వేయగా ఆ ఓవర్లోనూ 2ఫోర్లు, 1సిక్సర్‌తో మొయిన్ అలీ చెలరేగి ఆడాడు. ఆ ఓవర్లోనూ 16పరుగులొచ్చాయి.

బౌల్ట్ బౌలింగ్‌ను తుత్తునియలు చేసి రికార్డు
పవర్ ప్లే ముగుస్తుందనగా ఆరో ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌కు దిగాడు. అతని బౌలింగ్‌ను మొయిన్ చీల్చి చెండాడాడు. ఆ ఓవర్ తొలి బంతికి భారీ సిక్సర్ కొట్టిన అలీ తర్వాత వరుసగా 5బంతుల్లో 5 వైవిధ్యమైన ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును రంకెలేయించాడు. ఆ ఓవర్లో 6,4,4,4,4,4తో ఏకంగా మొయిన్ అలీ ఏకంగా 26పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో కేవలం 19బంతుల్లోనే మొయిన్ అలీ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పవర్ ప్లే (6ఓవర్లు) పూర్తయ్యేసరికి చెన్నై స్కోరు వికెట్ కోల్పోయి 75పరుగులు చేసింది. ఇక తన హాఫ్ సెంచరీతో సీఎస్కే తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. అంతకుముందు 2014సీజన్లో సురేష్ రైనా 16బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సీఎస్కే తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు. ఇక పవర్ ప్లేలో ఓపెనర్ కాకుండా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్లలో సురేష్ రైనా, సాహా తర్వాత మొయిన్ అలీ నిలిచి అరుదైన రికార్డులు నెలకొల్పాడు.

హాఫ్ సెంచరీ తర్వాత నెమ్మదించిన మొయిన్ అలీ
ఇక హాఫ్ సెంచరీ తర్వాత మొయిన్ అలీ దూకుడు కాసేపు కొనసాగించినా.. డెవాన్ కాన్వే, జగదీశన్, అంబటి రాయుడు త్వరత్వరగా ఔటవ్వడంతో అతను కాస్త శాంతించాడు. తర్వాత క్రీజులో దిగిన ధోనీతో కలిసి ఇన్నింగ్స్ నెమ్మదిగా ఆడడం ప్రారంభించాడు. 12ఓవర్లకు 100పూర్తి చేసుకున్న చెన్నై ఈజీగా 170పరుగులు చేస్తుందని అంతా అనుకుంటుండగా..కేవలం 150కే పరిమితమైంది. ఇక 20వ ఓవర్ తొలి బంతికి మొయిన్ అలీ క్యాచ్ ఔటవ్వడంతో అతను 93పరుగుల వద్ద త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అయినప్పటికీ పవర్ ప్లేలో మొయిన్ అలీ ఆడిన విధానం చెన్నై అభిమానులను ఉర్రూతలూగించింది.