
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ ఉద్దేశం ప్రకారం.. శ్రేయాస్ అయ్యర్ భారత జట్టు తదుపరి కెప్టెన్‌గా అయ్యేందుకు మంచి అవకాశాలు ఉన్నాయట. జాతీయ జట్టులో అతనికి 'మరిన్ని అవకాశాలు' ఇవ్వాలని స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. 27 ఏళ్ల అయ్యర్ 2022సీజన్‌లో తొలిసారిగా కోల్‌కతా నైట్ రైడర్స్‌కి కెప్టెన్సీ వహించాడు. అతని కెప్టెన్సీలో కేకేఆర్ ఏడో స్థానంలో నిలిచింది. అయ్యర్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 2019 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు, 2020 ఎడిషన్‌లో ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 'శ్రేయాస్ అయ్యర్‌లో నాకు నిజంగా నచ్చినది అతనిలో ఉన్న కెప్టెన్సీ లక్షణాలు. అతను టీమిండియాకు కూడా కెప్టెన్సీ వహించడానికి మంచి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను.' అని స్పోర్ట్స్ 18 షో 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్'లో స్టైరిస్ అన్నాడు.
'శ్రేయాస్ అయ్యార్‌ను కెప్టెన్‌గా చూడాలనుకుంటున్నాను. అందుకే అతనికి మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాను.' అని స్టైరిస్ తెలిపారు. ఇక ఇటీవల శ్రేయస్ ఫామ్ లేమితో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. షార్ట్ పిచ్ బంతులకు అతను పదే పదే ఔటవుతున్నాడు. ఇక అయ్యర్‌ను సురేష్ రైనాతో పోల్చిన మాజీ క్రికెటర్.. అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్లకు ఎలా ఎటాక్ చేయాలో తెలుసన్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అయ్యర్ పేలవమైన ఫామ్ కనబర్చాడు. ఇండియాపై ఇటీవల ఇంగ్లాండ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచిన బర్మింగ్‌హామ్ టెస్టులో అతను తొలి ఇన్నింగ్స్‌లో 15, రెండో ఇన్నింగ్స్‌లో 19పరుగులు మాత్రమే చేయగలిగాడు.
షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కొనే నైపుణ్యాన్ని శ్రేయాస్ అయ్యర్ పెంచుకోవాల్సి ఉంది. అతను దాన్ని డెవలప్ చేసుకుంటే.. అతను రెగ్యులర్ ప్లేయర్‌గా, కెప్టెన్‌గా ఉండడానికి అతనిలో అన్ని లక్షణాలు ఉంటాయని అంతవరకు అతనికి అవకాశాలు ఇవ్వాలని తాను భావిస్తున్నానని స్టైరిస్ అన్నాడు. అతను ఒకవేళ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోలేకపోతే లేదా బ్యాటింగ్లో రాణించలేకపోతే మీరు మరొకరిని వెతకాలి. కానీ అతను చాలా ప్రతిభావంతుడు. అయ్యర్ వెస్టిండీస్‌తో జరిగే మూడు వన్డేలు, ఐదు టీ20లకు ఎంపికయ్యాడు. భారత్ మరియు వెస్టిండీస్ మధ్య జూలై 22 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.