
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు పీడకలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ధోనీసేన ఈ మెగా టోర్నమెంట్ లీగ్ దశ నుంచి వైదొలగడానికి సమయం దగ్గరపడింది. ఒక్క మ్యాచ్ ఓడితే అదే జరుగుతుంది. ప్రపంచానికి కరోనా వైరస్ పట్టుకున్నట్టు.. చెన్నైని వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. టోర్నీ ప్రారంభం కావడానికి ముందు టైటిల్ హాట్ ఫేవరెట్‌గా కనిపించిన చెన్నై.. నెల తిరిగేసరికి చతికిలపడింది. వరుస ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు గెలిచినా.. సీఎస్‌కేకు అవకాశం ఉండకపోవచ్చు.
మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంది. అదికూడా 0.1 శాతమే. అయితే ప్రస్తుతం ఉన్న పోటీని చూస్తే.. ఆ కొద్ది అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇదే విషయాన్నీ న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ స్కాట్ స్టైరీస్ అభిప్రాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ టోర్నీ నుంచి నిష్క్రమించే స్థితిలో ఉందన్నాడు. చెన్నై జట్టులో చాలా మంది ఆటగాళ్లకు వయసు మీద పడుతోందని పేర్కొన్నాడు.
'ఐపీఎల్ 2020లో చెన్నై ప్లేఆఫ్స్ వెళ్లే అవకాశం లేదు. ఈ విషయం చెప్పడం నాకు బాధగానే ఉంది. కానీ పరిస్థితి మాత్రం అలానే ఉంది. గత మ్యాచ్ తర్వాత చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను బట్టి చెప్పొచ్చు. తమ జట్టు లైఫ్ సైకిల్ అయిపోందని ఫ్లేమింగ్ భావిస్తున్నాడు. ఇదే విషయం గురించి మూడేళ్లుగా మనం మాట్లాడుతున్నాం. చెన్నై జట్టులో చాలా మంది ఆటగాళ్లకు వయసు మీద పడుతోంది. వయసు పెరుగుతున్నప్పుడు ఒక దశలో ప్రదర్శన తగ్గుతుంది. బహుశా ఈ ఏడాది అది జరిగింది' అని స్టైరీస్ పేర్కొన్నాడు.
'చెన్నై జట్టులో ఎంఎస్ ధోనీ సహా చాలా మంది ఆటగాళ్లు 30 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. గత సీజన్లో ధోనీసేన ఆకట్టుకునే ప్రదర్శన చేసింది. ఈ సీజన్లో మాత్రం ఫ్లేఆఫ్స్ చేరడం కష్టం. చెన్నైలో మ్యాచ్ విన్నర్లకు వయసు మీద పడుతోంది. దీంతో ఫామ్‌లోకి రాలేకపోతున్నారు. ఫాఫ్ డుప్లెసిస్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. దీపక్ చహర్ ఆకట్టుకుంటున్నాడు. మిగతా వాళ్ల ప్రదర్శన బాగా లేదు' అని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.
నిజానికి చెన్నై ట్రాక్ రికార్డు అద్భుతంగా ఉంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కొన్న తరువాత కూడా ఈ స్థాయిలో పరాభవాన్ని చవి చూడలేదు. ఫిక్సింగ్ ఆరోపణల వల్ల ఐపీఎల్ టోర్నమెంట్‌లో నిషేధానికి గురైన ఆ రెండేళ్ల సీజన్‌ను పక్కన పెడితే.. ప్రతీసారీ తనదైన ముద్రను వేస్తూ వచ్చింది. టోర్నమెంట్‌పై ఆధిపత్యాన్ని చలాయించింది. ప్రతీసారీ ప్లేఆఫ్‌లో అడుగు పెట్టింది. 2010, 2011, 2018ల్లో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. 2008, 2012, 2013, 2015, 2019ల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి మాత్రం పూర్తిగా తేలిపోయింది.