
హైదరాబాద్: ఐపీఎల్ క్రేజ్ కు మించింది కోహ్లీ క్రేజ్.. అతని ఆట తీరు, ఫిట్‌నెస్, పెళ్లి విషయం అన్నింటిపైనా అమితాసక్తిని కనబరుస్తారు యూత్. త్వరలో కౌంటీల్లోనూ ఆడబోతోన్న కోహ్లీ మీడియాతో మాట్లాడారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయడం తన లక్ష్యం కాదని దాని కంటే మ్యాచ్‌లు గెలవడమే తనకు ముఖ్యమని అంటున్నాడు.
'నా దృష్టి ఎప్పుడూ మ్యాచ్‌లు గెలవడంపైనే ఉంటుంది. ట్రిపుల్ సెంచరీలాంటి లక్ష్యాలేమి నాకు లేవు. అవి ఇతరుల లక్ష్యాలు' అని కోహ్లి అన్నాడు. ఒత్తిడిలో రాణించడాన్ని అమితంగా ఆస్వాదించే కోహ్లి పరీక్షల ముందు విద్యార్థులపై ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతూ... 'బోర్డు పరీక్షలు రాసే సమయంలో నేను కూడా కొంత విరామం తీసుకొని ఆటలకు కేటాయించేవాడిని.
ఒత్తిడిని తగ్గించడంలో అవి ఎంతో తోడ్పడేవి. మానసిక ఉల్లాసంతో పాటు సానుకూల దృక్పథం పెరగడంలో ఆటల పాత్ర చాలా ముఖ్యమైనది. దీంతో తిరిగి చదువుపై శ్రద్ధ పెట్టగలిగేవాడిని. విజయాలు మనకు ఏమి నేర్పవు. పరాజయాలే పాఠాలు చెప్తాయి. కష్ట కాలంలోనే మనలోని నైపుణ్యాలకు పనిపెడతాం' అని పేర్కొన్నాడు.
2004వ సంవత్సరంలో సెహ్వాగ్ పాకిస్థాన్ గడ్డపై పోరాడి 309పరుగులను చేసి రికార్డు సృష్టించాడు. 2008వ సంవత్సరంలో దక్షిణాఫ్రికా గడ్డపై తలపడి రెండో సారి 300 దాటిన స్కోరు నమోదు చేశాడు. అదే క్రమంలో 2009లో శ్రీలంకతో 293 స్కోరును చేయగలిగాడు.ఇదే తరహాలో 2016వ సంవత్సరంలోనూ కరుణ్ నాయర్ ఇంగ్లాండ్‌పై ఆడిన మ్యాచ్‌లో అద్భుతమైన ప్రదర్శన చేయగలిగాడు.