
హైదరాబాద్: గత కొన్నేళ్లుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కూడా అద్భుత ప్రదర్శన చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, పాకిస్థాన్‌పై కోహ్లీ ఈజీగా పరుగులు సాధించలేడని ఆ జట్టు కోచ్ మిక్కీ ఆర్ధర్ ఛాలెంజ్ చేశాడు. ప్రస్తుతం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా సఫారీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించడంతో సఫారీ గడ్డపై కోహ్లీ తొలి సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఇప్పటి వరకు తాను పర్యటించిన అన్ని దేశాల్లో సెంచరీ సాధించిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. తాజాగా కోహ్లీ సెంచరీపై పాక్ కోచ్ మిక్కీ ఆర్ధర్ మీడియాతో మాట్లాడాడు.
'కోహ్లీ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారత జట్టు పర్యటనకు వెళ్లిన అన్నిదేశాల్లో సెంచరీ సాధించే కోహ్లీ పాక్ గడ్డపై సెంచరీ నమోదు చేయలేడు. ఎందుకంటే మా ఆటగాళ్లు కోహ్లీకి ఎంతో ప్రణాళికాబద్ధంగా బంతులేస్తారు. తాను ఆడిన అన్ని దేశాల్లో కోహ్లీ సెంచరీ సాధించడం సంతోషకరమైన విషయం. కోహ్లీ బ్యాటింగ్ శైలి నాకెంతో నచ్చుతుంది' అని అన్నాడు.
ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్ జరిగి చాలా సంవత్సరాలు అయింది. ప్రస్తుతం భారత్-పాక్‌లు ఐసీసీ నిర్వహించే టోర్నీలో మాత్రమే తలపడుతున్నాయి. భారత్‌తో ద్వైపాక్షిక సిరిస్ నిర్వహించాలని పాక్ బోర్డు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, భారత ప్రభుత్వం మాత్రం అందుకు అంగీకరించడం లేదు.
గతేడాది విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. దీంతో 2017 సంవత్సరానికి గాను ఐసీసీ అత్యుత్తమ క్రికెటర్‌కు ఇచ్చే సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీకి విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. గతేడాది సెప్టెంబర్ 21, 2016 నుంచి డిసెంబర్ 2017 వరకు కోహ్లీ 77.80 యావరేజితో 2,203 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు ఉన్నాయి.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.