న్యూఢిల్లీ: దేశంలో క్రికెట్‌పై గుత్తాధిపత్యం చేస్తోందంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందరో కుర్రాళ్లు మహేంద్ర సింగ్ ధోనీలా, విరాట్ కోహ్లీలా ఎదగాలనుకుంటున్నా.. క్రికెట్ బోర్డుకు అనుకూలురు కాకుంటే వారికి సరైన అవకాశాలు రావట్లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది.
'దేశంలో చాలా మంది కుర్రాళ్లు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్నారు. ఆటకున్న ఆకర్షణ వల్ల ధోని, కోహ్లీల్లా ఎదగాలనుకుంటున్నారు. కానీ, బిసిసిఐకి అనుకూలంగా లేకపోతే వారికి సమాన అవకాశాలు దక్కట్లేదు' అని ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
దేశంలో క్రికెట్‌ను బీసీసీఐ ఏకస్వామ్యంగా మార్చేసిందని, బోర్డు అనుమతి లేకుండా ఎవరూ క్రికెట్ ఆడే పరిస్థితి లేదని పేర్కొంది. 'ఒక ఆటగాడు క్రికెట్ ఆడాలనుకుంటే అతడు మీతో ఉండాలి. మీది పూర్తిగా ఏకస్వామ్యం. సభ్యులపై మీది గుత్తాధిపత్యం. వ్యక్తులు సభ్యులు కాకుండా మీరు అడ్డుకుంటారు' అని ధర్మాసనం మండిపడింది.

'ఉదాహరణకు ఒక ఈశాన్య రాష్ట్రంలో బిసిసిఐలో చేరాలనుకుంటే.. వారికి మీరు అనుమతి ఇవ్వడం లేదు. వారికి సమాన అవకాశాలు కల్పించడం లేదు. ఏకస్వామ్య విధానాలను అనుసరిస్తున్నారు. అందుకే సమాన అవకాశాలు కల్పించాలని అవసరం ఏర్పడింది' అని పేర్కొంది.
ఒక రాష్ట్రానికి ఒకే ఓటు ఉండాలన్న లోధా కమిటీ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లోధా కమిటీ సూచనలను ఎలా అమలు చేయాలనే విషయంలో సహకరించేందుకు సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణ్యంను కోర్టు సహాయకుడిగా నియమించింది.