ఆటలో మాత్రమే దూకుడుగా ఉండాలి.. దుర్భాషలాడటంలో కాదు: సచిన్


ఢిల్లీ: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న గొడవపై భారత మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. జెంటిల్‌మెన్ ఆటలో క్రీడాస్ఫూర్తి కలిగి ఉండడం స్వతహాగా ఉండాల్సిన లక్షణమన్నారు. ఎవరో చెబితే క్రీడాస్ఫూర్తి రాదన్నారు. క్రమశిక్షణతో ఉండటం ఎవరైనా ఇతరులకు నేర్పిస్తారని, మిగతాదంతా ఆటగాళ్లకు స్వతహాగా ఉండాల్సిన లక్షణమని సచిన్ అన్నారు. ఆటలో మాత్రమే దూకుడుగా ఉండాలి, దుర్భాషలాడటంలో కాదని ఆయన సూచించారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ మాట్లాడుతూ... 'దూకుడనేది ఆటలో కనిపించాలి. అది తమ బ్యాటింగ్, బౌలింగ్ ప్రదర్శనలో ఉండాలి. ఆ దూకుడే ఆటకు పనికొస్తుంది. ప్రతీ ఒక్కరూ దూకుడుగా ఉంటారు. ఒకరు ఏం మాట్లాడనంత మాత్రాన, ఏం చేయనంత మాత్రాన దూకుడుగా లేరనడం సరికాదు. అందరికీ గెలవాలనే ఉంటుంది. కాకపోతే అందుకు ఓ విధానం ఉంటుంది. పరిమితులు దాటకుండా ఉండాలి. టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ దూకుడుగా ఉండడని అనుకుంటున్నారా?. అతడికి ప్రతీ పాయింట్ గెలవాలనే ఉంటుంది. కానీ.. అతడి శారీరక భాష, ప్రవర్తించే తీరు మాత్రమే ప్రముఖంగా ఉంటాయి' అని అన్నారు.
'ఫిట్‌నెస్ ఆటగాళ్ల నైపుణ్యాన్ని మెరుగుపర్చదు. ఫిట్‌నెస్ అనేది కేవలం ఆటగాళ్ల నైపుణ్యాన్ని మరింత కాలం పొడిగిస్తుంది. ఎవరైనా బ్యాట్స్‌మెన్ మెరుగవ్వాలంటే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయాలి. అంతేకాని జిమ్‌లో గంటల కొద్ది కూర్చుంటే అది సాధ్యం కాదు. నెట్స్‌లో ఏది సాధన చేస్తే.. అదే తమ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది' అని సచిన్ పేర్కొన్నారు.
ఇటీవల ముగిసిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం బంగ్లా ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించి భారత ఆటగాళ్లను దూషించారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న గొడవపై ఐసీసీ సీరియస్ అయ్యింది. ఆటగాళ్లను తీరును తీవ్రంగా పరిగణిస్తూ వారిపై క్రమశిక్షణ చర్యలకు దిగింది. భారత బౌలర్లు ఆకాశ్ సింగ్, రవి బిష్ణోయ్.. బంగ్లా క్రికెటర్లలో తౌవ్హిద్ హృదయ్, షమిమ్ హొసేన్, రకీబుల్ హసన్ ఐసీసీ చర్యలకు బాధితులయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications