
ఇండోర్: భారత దేశవాళీ క్రికెట్‌లో ఓ వన్డే మ్యాచ్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ఎక్కడచూసినా.. ఈ మ్యాచ్ గురించే వార్తలు కనబడుతున్నాయి. ఉమెన్స్ సీనియర్ వన్డే ట్రోఫీలో భాగంగా నాగాలాండ్, ముంబై జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్ నిమిషాల్లోనే పూర్తయింది. నాగాలాండ్ జట్టును 17 పరుగులకే ఆలౌట్ చేయడమే కాకుండా.. కేవలం 4 బంతుల్లోనే ఛేదనను ముగించేసింది ముంబై. ఈ మ్యాచుకు ఆతిథ్యమిచ్చిన ఇండోర్ ఇందుకు వేదికైంది. పేసర్ సయాలి సత్ఘరె మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది.
హోల్కర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నాగాలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇదే వారి కొంప ముంచింది. ముంబై కెప్టెన్, మీడియం పేసర్ సయాలీ సత్ఘరె.. నాగాలాండ్ జట్టును బెంబేలెత్తించింది. 8.4 ఓవర్లలో కేవలం 5 పరుగులిచ్చి 7 వికెట్లు తీసింది. సయాలీ ధాటికి ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరుని నమోదు చేయలేకపోయారు. ఓపెనర్లు జ్యోతి (0), కికయంగ్ల (0)తో పాటు కెప్టెన్ సెంటిలీమ్ల (0), ఎలీనా (0) వరుసగా డకౌట్ అయ్యారు.
సయాలీతో పాటు ఎస్. థాకోర్ (1/0), దాక్షిణి (2/12) ఆధిపత్యం చెలాయించడంతో సరీబా (9) మాత్రమే కాసేపు క్రీజులో నిలిచి పరుగులు చేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన సరీబా టాప్ స్కోరర్‌గా నిలవడం విశేషం. చివరకు నాగాలాండ్ 17.4 ఓవర్లలో 17 పరుగులకి ఆలౌట్ అయింది. నాగాలాండ్ ఆడిన ఓవర్లలో 4 మెయిడిన్లు ఉండటం మరో విశేషం.
స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై కేవలం 4 బంతుల్లోనే విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఇషా ఓజా, వృషాలీ భగత్ కలిసి మూడు బౌండరీలు, ఒక సిక్సర్ బాదేశారు. భగత్.. వరుసగా 4, 4, 4, 6 బాదేసి ముంబైని గెలిపించింది. దీంతో 49.2 ఓవర్లు మిగిలుండగానే 10 వికెట్ల తేడాతో ముంబై గెలుపొందింది. అద్భుత ప్రదర్శన చేసిన సయాలికి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.