
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో తొలి ప్రొఫెషనల్ టీ20లీగ్ ప్రారంభానికి వేగంగా చర్యలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇండో అమెరికన్ వ్యాపార దిగ్గజాలు అమెరికాలో మొదటి ప్రొఫెషనల్ టీ20లీగ్‌ని ప్రారంభించేందుకు 120మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చేందుకు రెడీ అయ్యారు. గురువారం ఈ టీ20 లీగ్ పేరు మేజర్ లీగ్ క్రికెట్ (MLC)గా నిర్వాహకులు ప్రకటించారు. ఈ క్రమంలో ఫండ్ రైజింగ్లో భాగంగా Series A, A1పేరిట నిర్వహించిన మొదటి రౌండ్‌లో 44మిలియన్ల డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈ ఫండ్ రైజింగ్ రౌండ్‌లో ప్రధానంగా అమెరికన్ వ్యాపార దిగ్గజాలు తమ ఆసక్తి కనబరిచారు. ఇక రెండో రౌండ్ ఫండ్ రైజింగ్ లక్ష్యం 76 మిలియన్ల డాలర్లు. ఈ నిధులను సమీకరించడానికి నిబద్ధతతో పనిచేస్తున్నట్లు ఎంఎల్సీ నిర్వాహకులు తెలిపారు. అమెరికాలో జరగబోయే మొట్టమొదటి ప్రొఫెషనల్ టీ20 లీగ్ అయిన ఎంఎల్సీని ప్రారంభించడానికి 120మిలియన్ల డాలర్లకు పైగా నిధులను ఖర్చుపెట్టి గ్రాండ్ గా నిర్వహించాలని నిర్వాహకులు ప్రణాళికలు చేపడుతున్నారు.
సిరీస్ A , సిరీస్ A1తో కూడిన తొలి రౌండ్ నిధుల సమీకరణలో భాగంగా అత్యధికంగా ఇన్వెస్ట్ చేసినవారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ ప్రముఖంగా ఉన్నారు. ఇకపోతే వీరితో పాటు ఇతర పెట్టుబడిదారులలో మడ్రోనా వెంచర్ గ్రూప్ ఎండీ సోమా సోమసేగర్, మిలివేస్ వెంచర్స్ వ్యవస్థాపక భాగస్వాములు ఆనంద్ రాజారామన్, రాకెట్‌షిప్ వీసీ వెంకీ హరినారాయణ్, ఇన్ఫినిట్ కంప్యూటర్ సొల్యూషన్స్ చైర్మన్ జైటర్ సంజయ్ గోవి తదితరులు ఉన్నారు. ఇండో అమెరికన్ వ్యాపార దిగ్గజాలైన ప్రీతీష్ నిజవాన్, ఎండీ శంకర్ కలియపెరుమాళ్, దిఘా శేఖరన్ తదితరులు కూడా ఇన్వెస్టర్లుగా ఉన్నారు.
ఈ ఫండ్ రైజింగ్‌కు సంబంధించి MLC సహ వ్యవస్థాపకులు సమీర్ మెహతా, విజయ్ శ్రీనివాసన్ సంయుక్తంగా ఓ ప్రకటన చేశారు. 'అత్యుత్తమ పెట్టుబడిదారుల ద్వారా సేకరించిన నిధులు మేజర్ లీగ్ క్రికెట్‌లో ఫస్ట్ క్లాస్ సౌకర్యాలను నిర్మించడానికి, అమెరికాలో క్రికెట్ క్రీడను అభివృద్ధి పరచడానికి ఉపకరిస్తుంది. ప్రపంచ స్థాయిలో అతిపెద్ద క్రికెట్ మార్కెట్ నెలకొంటుంది' అని పేర్కొన్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న నాయకులు ఈ టీ20లీగ్‌ని ప్రారంభించడానికి ఇన్వెస్ట్ చేశారని, వారి అనుభవాన్ని ఉపయోగించుకుని ఈ లీగ్‌ను సమర్థవంతంగా నడిపిస్తామని పేర్కొన్నారు.