ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ఎంపికపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టులో చోటు కోల్పోయాడు. శ్రేయస్ స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం లభించడంతో శ్రేయస్ భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీసీఐ 15 మంది సభ్యుల జట్టును ప్రకటించిన వెంటనే శ్రేయస్ అయ్యర్ మొదటిసారి స్పందించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం సృష్టించింది.
శ్రేయస్ అయ్యర్ మొదటి స్పందన.. వైరల్ అయిన వీడియో
భారత జట్టు ప్రకటన వెలువడిన ఒకరోజు తర్వాత.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టు తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. "సర్పంచ్ సాబ్" అనే సరదా క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో శ్రేయస్ అయ్యర్ ముఖంలో నిరాశ, ఆందోళన కనిపిస్తున్నాయని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కేవలం ఒక వీడియో మాత్రమే అయినా, ఈ పరిస్థితిపై శ్రేయస్ అయ్యర్ ఎంత నిరాశగా ఉన్నాడో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు.

అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా.. అవకాశం దక్కలేదు..
శ్రేయస్ అయ్యర్ ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. శ్రేయస్ పంజాబ్ కింగ్స్‌ను రెండోసారి ఫైనల్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో 175.07 స్ట్రైక్ రేట్‌తో 600లకు పైగా పరుగులు చేశాడు. అయినప్పటికీ అయ్యర్‌కు జట్టులో స్థానం దక్కకపోవడంతో సెలెక్టర్ల నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐపీఎల్‌లో ఇంత అద్భుతమైన ప్రదర్శన తర్వాత కూడా ఛాన్స్ దక్కకపోతే, ఇక ఎప్పుడు అవకాశం ఇస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగర్కర్ మాత్రం ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ మాట్లాడారు. "ప్రస్తుతానికి శ్రేయస్‌కు జట్టులో స్థానం లేదు. ఎవరి స్థానంలో అతన్ని ఎంపిక చేస్తామో చెప్పడం కష్టం. ఇది అతని తప్పు కాదు, మా తప్పు కూడా కాదు. ప్రస్తుతం ఉన్న 15 మంది ఆటగాళ్లలో అతనికి స్థానం దక్కలేదు. అతను తన అవకాశం కోసం వేచి చూడాలి" అని పేర్కొన్నారు.
మిడిలార్డర్‌లో తీవ్రమైన పోటీ
శ్రేయస్ అయ్యర్ చివరిసారిగా డిసెంబర్ 2023లో ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 30.66 సగటు, 136.12 స్ట్రైక్ రేట్‌తో అతను నిలకడైన ప్రదర్శన కనబరిచాడు. అయితే, ప్రస్తుతం భారత జట్టు మిడిలార్డర్‌లో పోటీ చాలా ఎక్కువగా ఉంది. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ వంటి స్టార్ ప్లేయర్స్ తమ స్థానాలను ఖరారు చేసుకున్నారు.