
మాంఛెస్టర్: ఒక్క ఓటమి.. పాకిస్తాన్ జట్టును చీల్చి చెండాడుతోంది. ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఆడాల్సిన మ్యాచ్‌లో దారుణంగా ఓటమి పాలు కావడం, భారత్ వంటి బలమైన జట్టును ఎదురుగా ఉంచుకుని కనీసం ప్రతిఘటించాలనే ఆలోచన కూడా లేకుండా పరాజయం పాలు కావడం పట్ల పాకిస్తాన్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమౌతుండగా.. భారత్‌లో మాత్రం సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ప్రపంచకప్‌లో ఏనాడూ పాకిస్తాన్ చేతిలో ఓటమి చవి చూడని రికార్డను కొనసాగిస్తోంది టీమిండియా. మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో పాక్‌పై మొత్తం ఏడుసార్లు విజయం సాధించిన రికార్డును అందుకుంది.
కేప్టెన్సీ బాగోలేదు..
సర్ఫరాజ్ అహ్మద్ కేప్టెన్సీ ఆశించిన స్థాయిలో లేదని, ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో పైగా ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్‌లో అంచనాలకు మించి రాణించాల్సిన అవసరం ఉందని సచిన్ అన్నారు. మ్యాచ్ ఆరంభం నుంచీ సర్ఫరాజ్ ఓ రకమైన గందరగోళంలో కనిపించారని చెప్పారు. దీని ప్రభావం జట్టు బౌలర్లు, ఫీల్డింగ్ మోహరింపుపై పడిందని ఆయన విశ్లేషించారు. వాహబ్ రియాజ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో సర్ఫరాజ్ అహ్మద్ తీసుకున్న స్టాండ్ దీనికి అద్దం పడుతోందని అన్నారు. వాహబ్ రియాజ్ బౌలింగ్ సందర్భంగా వికెట్ కీపర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ మిడ్ వికెట్ స్థానంలో నిల్చున్నాడని, అదే సమయంలో షాదబ్ ఖాన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో స్లిప్ వైపు ఉండేలా సర్ఫరాజ్ తీసుకున్న స్టాండ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనివల్ల బౌలర్లు అయోమయానికి గురవుతారని చెప్పారు.
అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచన చేయలేదు..
భారత బ్యాటింగ్ బలంగా ఉంది. బౌలింగ్ లైనప్ అద్భుతంగా ఉంది. అలాంటప్పుడు పాకిస్తాన్ మరింత పకడ్బందీగా ప్రణాళకలు, వ్యూహాలను రచించుకోవాల్సి ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా పాకిస్తాన్ జట్టు వ్యవహరించిందని సచిన్ అన్నారు. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేయలేకపోయారని చెప్పారు. బలమైన జట్టును ఢీ కొట్టాల్సి వచ్చినప్పుడు సంప్రదాయబద్ధమైన ఆటతీరును ప్రదర్శించడంతో పాటు దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందని, అక్కడే పాకిస్తాన్ విఫలమైందని చెప్పారు మాస్టర్ బ్లాస్టర్. బంతి చురుగ్గా కదలనప్పుడు రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయాల్సి ఉంటుందని, వాహబ్ రియాజ్ ఆ పని చేసినప్పటికీ.. అప్పటికే ఆలస్యమైందని అన్నారు. హసన్ అలీ ఒక్కడే కాస్త మెరుగ్గా బౌలింగ్ చేశాడని చెప్పారు.