
ముంబై: క్రీడాకారుల్లో ఫిట్‌నెస్ అంటే ముందుగుర్తొచ్చేది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే. ఈ మధ్యే ఇండియన్ క్రికెట్‌లో అడుగుపెట్టిన యోయో టెస్ట్‌లో పాసైతేనే నేషనల్ టీమ్‌లో చోటు ఉంటుందని కొత్త నిబంధన కూడా ప్రవేశపెట్టారు. సహజంగానే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ టెస్ట్‌లో అందరి కన్నా ఎక్కువ మార్కులు సాధించాడు. అసలు టీమ్‌లో అతనికి ఉన్నంత ఫిట్‌నెస్ ఏ క్రికెటర్‌కు కూడా ఉండదని అందరి నమ్మకం.
అలాంటి కోహ్లిని కూడా మించిపోయాడు ఇండియన్ హాకీ ప్లేయర్ సర్దార్ సింగ్. 32 ఏళ్ల ఈ స్టార్ హాకీ ప్లేయర్ ఫిట్‌నెస్ ముందు ఎవరైనా దిగదుడుపే. కోహ్లి యోయో టెస్ట్ స్కోరు 19 మాత్రమే. అదే సర్దార్ సింగ్ 21.4 స్కోరుతో విరాట్‌ను సునాయాసంగా అధిగమించేశాడు. నిజానికి క్రికెటర్ కనీసం 16.1 స్కోరు సాధిస్తేనే నేషనల్ టీమ్‌లోకి ఎంపిక చేస్తున్నారు. అయితే ఇప్పుడు సర్దార్ సింగ్ సాధించిన స్కోరు దీనికంటే చాలా ఎక్కువ.
మరి అంతటి ఫిటెనెస్ దేనికి కావాలి అంటే హాకీ కోసమట. ఫీల్డ్‌లో నెమ్మెదిగా కదులుతున్నాడని అజ్లాన్ షా కప్ టోర్నీ నుంచి సర్దార్ సింగ్‌ను తొలగించారు. అప్పటి నుంచి తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన అతడు.. తీవ్రంగా కసరత్తులు చేశాడు. చివరకి పూర్తి ఫిట్‌నెస్‌ను సాధించాడు. తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. ఇంతటి ఫిట్‌నెస్ సాధించడంపై సర్దార్ సింగ్ మాట్లాడుతూ.. ఇలా అన్నాడు.
'టీమ్‌లో నుంచి తీసేసినపుడు చాలా భయపడ్డాను. అంతా అయిపోయిందని అనుకున్నాను. హాకీ లేకపోతే ఇక డబ్బు, కార్లు ఉండి ఏం లాభం అనిపించింది. అప్పుడే డిసైడ్ అయ్యాను. సర్దార్ ఫిట్ లేడు అని ఎవరూ వేలెత్తి చూపకుండా తయారు కావాలని నిర్ణయించుకున్నా' అని సర్దార్ సింగ్ నిర్ణయించుకున్నాడట. అతను టీమ్‌లోకి తిరిగి రావడానికి ఎంతగా శ్రమించాడో రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటోలే నిదర్శనం.