
ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం కుటుంబంతో సహా విహారయాత్రకు వెళ్లాడు. ఎక్కడికి వెళ్లాడనే సమాచారం తెలియదు కానీ సచిన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ కుమారుడు, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నాడు. మొదటగా తానొక్కడే సైక్లింగ్ చేస్తున్న ఫొటోలు పంచుకున్న లిటిల్ మాస్టర్.. ఆ తర్వాత కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశాడు. అనంతరం సారా టెండూల్కర్ సెయిలింగ్ చేస్తున్న వీడియోను షేర్ చేశాడు. తాజాగా సముద్రంలో సారాతో కలిసి బోటింగ్‌కు వెళ్లిన సెల్ఫీని అభిమానులతో పంచుకున్నాడు.
సచిన్ టెండూల్కర్, సారా టెండూల్కర్ లైఫ్ జాకెట్స్ ధరించి కళ్లద్దాలు పెట్టుకొని పడవలో వెళుతున్న సమయంలో తీసిన ఫొటోను లిటిల్ మాస్టర్ ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఫొటోకి ఇలా కాప్షన్ ఇచ్చాడు. 'సారా: బాబా.. మనం సముద్రంలో తప్పిపోయామా?' అని అడిగితే.. 'నాకూ కచ్చితంగా తెలియదు' అని సరదాగా బదులిచ్చాడు. కరోనా కారణంగా మార్చిలో లాక్‌డౌన్ విధించినప్పటి నుంచీ ఇంట్లోనే ఉంటున్న సచిన్ ఇటీవలే బయటకు రావడం మొదలుపెట్టాడు.
తాజాగా సచిన్ ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ తన కెరీర్‌లోని మూడు బెస్ట్ ఇన్నింగ్స్‌లను ఎంపిక చేసుకున్నాడు. వాటి హైలెట్స్‌ను ఇప్పుడు కూడా వీక్షిస్తానని తెలిపాడు. 1998లో షార్జా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు. సెమీ ఫైనల్లో సెంచరీతో మెరిసి జట్టును ఫైనల్ చేర్చాడు. అదే ఊపుతో ఫైనల్లో మరో సెంచరీ బాదేసి కోకకోలా కప్‌ను టీమిండియాకు అందించాడు. ఇక 2003 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు ఇన్నింగ్స్ మూడోది.
1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు బాదాడు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించాడు.