
ప్లేఆఫ్ క్వాలిఫైయర్ 2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 7వికెట్ల తేడాతో ఓడించిన సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2022 ఫైనల్స్‌కు సగర్వంగా చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్ దశలో రాయల్స్ 14మ్యాచ్‌లలో తొమ్మిది గెలిచి రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక క్వాలిఫయర్ 1లో గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్.. క్వాలిఫయర్ 2లో ఆర్సీబీని మట్టికరిపించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని చేజిక్కించుకోవాలని రాజస్థాన్ ఉవ్విళ్లూరుతుంది. ఈ సీజన్లో మేటి జట్లలో ఒకటైన రాజస్థాన్ ను మాత్రం ఐపీఎల్ ప్రసారకర్తలు ఓ వీడియోలో పట్టించుకోలేదు.
ఈ సీజన్ ప్రారంభంలో ఐపీఎల్ ప్రసారకర్తలు ఓ యానిమేటెడ్ వీడియో చేయగా.. అందరూ కెప్టెన్లు అందులో కన్పించారు. కానీ సంజూశాంసన్ మాత్రం కన్పించలేదు. దీంతో ఐపీఎల్ ప్రసారకర్తలను ఉద్దేశించి రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ భార్య అసహనం వ్యక్తం చేసింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ స్టోరీ పోస్టు చేసింది. అన్ని జట్ల కెప్టెన్లు ఉన్నప్పుడు రాజస్థాన్ స్కిప్పర్ అయిన సంజూ శాంసన్ ను ఎందుకు ఆ యానిమేటెడ్ వీడియోలో చూపించలేదంటూ మండిపడింది. తన భర్తే ఐపీఎల్ ప్రకటనకర్తలకు లోకువయ్యాడా అనేలా గట్టిగా ప్రశ్నించింది.
సంజూ శాంసన్ భార్య చారులత రమేష్ స్పందిస్తూ.. 'ఐపీఎల్ 2022 ట్రోఫీ రేసును చూపించే ఈ యానిమేటెడ్ వీడియోను మొదటి రోజు ఐపీఎల్ ప్రెజెంటర్స్ ప్రసారం చేశారు. ఇందులో పింక్ జెర్సీ ఎందుకు మిస్సయిందో మాత్రం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి రాజస్థాన్ ఫైనల్ చేరుకుంది. అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక తన స్టోరీలో తర్వాతి పోస్టుగా రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫైనల్‌కు చేరుకున్న చిత్రాన్ని కూడా ఆమె షేర్ చేసింది.

ఐపీఎల్ 2022లో సంజూ శాంసన్ కెప్టెన్సీ చాలా ప్రభావవంతగా ఉంది. ప్రారంభంలో శాంసన్ కాస్త ఇబ్బంది పడ్డ మాట వాస్తవం. కానీ అతని నాయకత్వంపై మాత్రం రాజస్థాన్ ఫ్రాంఛైజీ పూర్తి భరోసాతో ఉంది. ఇక సంజూ శాంసన్ కెప్టెన్సీపై నెలకొన్న చాలా సందేహాలను అతను పటాపంచలు చేశాడు. తనపై వచ్చిన విమర్శలను గట్టి జవాబిచ్చాడు. అతను తన సహచరులకు మద్దతు ఇవ్వడమే కాకుండా, డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ 14ఏళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్ ఆడనుంది. 2008లో చివరిసారిగా ఆ జట్టు ఫైనల్ ఆడింది. ఇకపోతే రాజస్థాన్ రాయల్స్ తమ రెండో టైటిల్ కోసం ఎదురుచూస్తుండగా.. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌లో గెలిచి అరంగేట్రం చేసిన తొలి సీజన్లోనే కప్ గెలవాలని ఉబలాటంగా ఉంది. ఆర్సీబీతో జరిగిన చివరి గేమ్‌లో జోస్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో మంచి జోష్ మీద ఉండడం, మిగతా బ్యాటర్లు, బౌలర్లు అందరూ కూడా తలో చేయి వేసేలా ఆడడంతో రాజస్థాన్ ఈసారి టైటిల్ ఫేవరేట్ గా కన్పిస్తోంది.