భారత మాజీ ఆటగాడు, సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికెట్ కీపర్, బ్యాటర్ సంజు శాంసన్‌కు, రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయని బహిరంగంగా మాట్లాడారు. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ వల్లే సంజు శాంసన్ జట్టును వీడుతున్నాడనే చర్చ జరుగుతున్న సమయంలో శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టును వీడాలని అనుకుంటున్నారని.. వేలంలో విడుదల చేయాలని మేనేజ్మెంట్‌ను కోరినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. 2013 నుంచి రాజస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా, 2021 నుంచి కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్ ఈ ఆకస్మిక నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అంతే కాకుండా సంజు శాంసన్ సీఎస్కే జట్టులోకి మారనున్నాడని కూడా ఒక సమాచారం వినిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ.. "ఇటీవల వస్తున్న వార్తలను చూస్తుంటే సంజు శాంసన్‌కు, రాహుల్ ద్రవిడ్‌కు మధ్య ఏదో అభిప్రాయభేధం ఉన్నట్లు అనిపిస్తోంది. కానీ దాని గురించి నాకు పూర్తిగా తెలియదు. అంతే కాకుండా రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్‌ను భారీ మొత్తానికి రిటైన్ చేసుకొని అతని చుట్టూనే జట్టూనే నిర్మించింది. అతడిని అకస్మాత్తుగా వదిలేస్తే జట్టు సమతుల్యత ఏమవుతుంది? ఒకవేళ వారు రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా నియమించాలనుకుంటే, అది వారి ఇష్టం. అయినా సంజు శాంసన్‌ను కనీసం ఒక బ్యాటర్‌గా అయినా జట్టులో ఉంచాలి." అని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
గత ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలో సంజు శాంసన్ కు గాయం కారణంగా మొదటి మూడు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించారు. అస్సాం రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉన్న రియాన్ పరాగ్‌ను రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా నియమించడం, మేనేజ్మెంట్ అతనిపై ఉంచిన నమ్మకాన్ని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో సంజు శాసన్ వెళ్లిపోతే రియాన్ పరాగ్ శాశ్వత కెప్టెన్‌గా నియమించబడవచ్చు అనే చర్చలు ఊపందుకున్నాయి.
సంజు శాంసన్‌కు, రాహుల్ ద్రవిడ్‌కు మధ్య మంచి సంబంధం ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. చాలా సంవత్సరాల క్రితం కేరళ క్రికెట్ అసోసియేషన్ సంజు శాంసన్‌ను జట్టు నుంచి తొలగించడానికి ప్రయత్నించినప్పుడు ద్రవిడ్ అతనికి మద్ధతుగా నిలబడి రక్షించారని సంజు తండ్రి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అలాంటప్పుడు ఇప్పుడు ఇద్దరి మధ్య అభిప్రాయభేదం వచ్చిందని చెప్పడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజు శాంసన్ వెళ్లిపోతే అతడిని తమ జట్టులో చేర్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉందని.. ధోనికి సరైన ప్రత్యామ్నాయంగా సంజు శాంసన్ ఉంటారని శ్రీకాంత్ అన్నారు. ఏది ఏమైనప్పటికీ శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ వర్గాల్లో కొత్త అలజడి సృష్టించాయి. సంజు శాంసన్-ద్రవిడ్ మధ్య విభేదాలు నిజమా లేక పుకార్లా అనేది త్వరలో తెలుస్తుంది.