రానున్న టీ20 వరల్డ్ కప్‌కు జట్టును వెల్లడించడానికి మే 1వ తేదీనే ఆఖరి గడువు. ఇప్పటికే మెగా టోర్నీలో పాల్గొనే తమ జట్టును ఇవాళ న్యూజిలాండ్ ప్రకటించింది. మరోవైపు రేపు లేదా ఎల్లుండి భారత జట్టును బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది. అయితే టీమిండియా ఎంపిక గురించి ఓ హాట్ న్యూస్ వైరల్‌గా మారింది.
అంచనాలను తలకిందులు చేస్తూ సంజు శాంసన్ ఎంపికలో టాప్‌లో నిలిచాడని తెలుస్తోంది. రిషభ్ పంత్‌ను కాదని శాంసన్‌ను ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్‌గా సెలక్టర్లు పరిగణిస్తున్నారని సమాచారం. రోడ్డు ప్రమాదానికి గురై దాదాపు 15 నెలల అనంతరం తిరిగి బరిలోకి దిగిన పంత్ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నాడు. కానీ పంత్ కంటే శాంసన్ నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు.

ఐపీఎల్‌లో తొమ్మిది మ్యాచ్‌ల్లో 77 సగటుతో శాంసన్ 385 పరుగులు చేశాడు. అంతేగాక స్పిన్నర్లపై దూకుడుగా ఆడటం శాంసన్ ఎంపికకు అదనపు బలంగా చేకూరింది. మరోవైపు ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా యువకులకు ప్రపంచకప్ జట్టులో చోటు ఇస్తారనే వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం లేని ఆటగాళ్లకు సెలక్టర్లు మొండిచేయి చూపించారని సమాచారం.
వికెట్ కీపర్ స్థానంలో పోటీలో శాంసన్, పంత్‌తో పాటు జితేశ్ శర్మ, కేఎల్ రాహుల్ కూడా ఉన్నారు. అయితే జితేశ్ ఫామ్ కోల్పోవడంతో అతని పక్కనపెట్టనున్నారు. టాప్ ఆర్డర్‌లో ఇప్పటికే స్థానాలు ఖరారు కావడంతో రాహుల్‌కు నిరాశే మిగలనుంది. అయితే రింకూ సింగ్, శివమ్ దూబె ఎంపిక విషయంలో సెలక్టర్లు తలపట్టుకుంటున్నారు. హార్దిక్ పాండ్య, దూబె మీడియం పేస్ వేసే సామర్థ్యం ఉన్నప్పటికీ బౌలింగ్‌లో ఆకట్టుకోలేకపోతున్నారు.
ఒకవేళ రింకూ సింగ్, దూబెను వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేస్తే బ్యాకప్ ఫాస్ట్ బౌలర్ లేకుండా జట్టును ప్రకటించే పరిస్థితి తలెత్తింది. కాగా, శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు దక్కని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిజర్వ్ ప్లేయర్లుగా చాహల్, సందీప్ శర్మను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు (అంచనా)
టాప్ ఆర్డర్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్
మిడిల్ & లోయర్ ఆర్డర్: సంజు శాంసన్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శివమ్ దూబె, రింకూ సింగ్
స్పిన్నర్: కుల్‌దీప్ యాదవ్
ఫాస్ట్ బౌలర్లు: జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: కేఎల్ రాహుల్, యుజువేంద్ర చాహల్, సందీప్ శర్మ.