T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో జింబాబ్వేతో జరిగిన కీలకపోరులో టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్ తన సత్తా చాటాడు. గాల్లోకి డైవ్ చేస్తూ సంజూ పట్టిన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గాల్లోకి ఎగిరి స్టన్నింగ్ క్యాచ్
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ల వెనుక తన అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా శివమ్ దూబే వేసిన ఓవర్‌లో సంజూ శాంసన్ పట్టిన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. జింబాబ్వే బ్యాటర్ తాషింగా ముసెకివా భారీ షాట్ కొట్టే ప్రయత్నం చేయగా.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ల వెనుక వేగంగా వెళ్లింది. ఆ సమయంలో సంజూ శాంసన్ తన కుడివైపునకు గాల్లోకి డైవ్ చేస్తూ అద్భుతమైన రీతిలో బంతిని క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ కారణంగానే ఈ మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకున్న శివమ్ దూబేకు ఒక వికెట్ దక్కింది.

బ్యాటింగ్‌లోనూ కీలక పాత్ర
ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ కేవలం కీపింగ్‌లోనే కాకుండా బ్యాటింగ్‌లోనూ మెరిశాడు. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన సంజూ శాంసన్.. తొలి ఓవర్లోనే సిక్సర్‌తో తన ఉద్దేశాన్ని చాటాడు. కేవలం 15 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 24 పరుగులు చేశాడు. అంతకుముందు జరిగిన 5 ఇన్నింగ్స్‌ల్లో కలిపి భారత ఓపెనింగ్ జోడీ కేవలం 34 పరుగులే చేయగా.. సంజూ-అభిషేక్ జోడీ మొదటి వికెట్‌కు 47 పరుగులు జోడించి జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం రింకూ సింగ్‌ను పక్కన పెట్టి సంజూను తీసుకోవడం ఈ మ్యాచ్‌లో సత్ఫలితాలను ఇచ్చింది.
భారత్ భారీ విజయం.. సెమీస్ ఆశలు సజీవం
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం. అనంతరం ఛేదనలో జింబాబ్వే బ్యాటర్ బ్రియన్ బెనెట్ (97 నాటౌట్) ఒంటరి పోరాటం చేసినప్పటికీ.. ఆ జట్టు 184 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, సెమీఫైనల్ రేసులో బలంగా నిలిచింది.