
టీమిండియా యువ ప్లేయర్ సంజూ శాంసన్ మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో సంజూ ఆడాడు. ఆ సిరీస్ తొలి మ్యాచ్‌లోనే ఫీల్డింగ్ చేస్తుండగా అతనికి గాయమైంది. దీంతో ఆ సిరీస్‌తోపాటు లంక వన్డేలకు కూడా దూరమయ్యాడు. న్యూజిల్యాండ్‌తో సిరీస్ నాటికి కూడా అతను కోలుకోలేదు. దీంతో కివీస్ సిరీస్‌లో కూడా ఆడలేదు. అయితే ఇప్పుడు అతను కోలుకొని తన ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ రాయల్స్ జట్టు పెర్ఫామెన్స్ స్పెషలిస్ట్ రాజమణి ప్రభు పర్యవేక్షణలో సంజూ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. సంజూ ఫిట్‌నెస్ రొటీన్‌కు సంబంధించిన వీడియోను రాజమణి తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. 'తొలిసారి వింటున్న నిజం కన్నా.. వందసార్లు విన్న అబద్ధాన్ని నమ్మడం ఈజీ' అని దీనికి క్యాప్షన్ జత చేశాడు. సంజూ కనుక పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో అతన్ని ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత కొందరు సీనియర్లకు విశ్రాంతి ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో వన్డేల్లో కుర్రాళ్లకు చోటు దక్కే అవకాశం ఉంది.
ఈ క్రమంలో సంజూ కూడా ఈ సిరీస్ ఆడేలా కనిపిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ ఎంపిక చేసిన 20 మంది ఆటగాళ్లలో సంజూ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని ఇకపై జరిగే అన్ని వన్డే సిరీసులకు ఎంపిక చేస్తారని సమాచారం. అదే జరిగితే సంజూ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుష్ అయిపోతారు.
ఒక వేళ ఆస్ట్రేలియాతో వన్డేలకు అతన్ని ఎంపిక చేయకపోతే మాత్రం.. మార్చిలో మొదలయ్యే ఐపీఎల్‌లోనే సంజూ యాక్షన్‌లోకి దిగుతాడు. గతేడాది అతని కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాంటి ప్రదర్శనే చేసి, ఎలాగైనా కప్పు కొట్టాలని ఈ ఫ్రాంచైజీ భావిస్తోంది.