
హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్ ఆరంభంలోనే తొలి సెంచరీ నమోదు చేసిన రాజస్థాన్ రాయల్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సంజు శాంసన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 55 బంతుల్లోనే 10ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సంజు శాంసన్ 102 పరుగులు చేశాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఐపీఎల్ చరిత్రలో అతనికిది రెండో సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో సంజు శాంసన్... విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్ సరసన చేరాడు. అంతకుముందు 2017 సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్‌గెయింట్స్‌పై ఢిల్లీ డేర్‌డెవిల్స్(ప్రస్తుతం క్యాపిటల్స్) తరఫున తొలి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన సంజు శాంసన్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఓపెనర్ జోస్ బట్లర్(5) ఔటవగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ మరో ఓపెనర్ అజింక్య రహానే (70: 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 134 వద్ద రహానే ఔటయ్యాడు. ఈ క్రమంలో సంజు శాంసన్ ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్ (16 నాటౌట్: 9 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్‌రైజర్స్ అగ్రశ్రేణి బౌలర్ భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 2, 4, 4 బాదేశాడు. మొత్తంగా చివరి 5 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 76 పరుగుల్ని రాబట్టగలిగింది.
దీంతో చివరికి సన్‌రైజర్స్ ముందు 199 పరుగులు భారీ లక్ష్యం ఉంచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టును వార్నర్(69), బెయిర్‌స్టో(45) రాణించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకొని హైదరాబాద్ విజయం సాధించింది.