
హైదరాబాద్: టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కేరళ జట్టు తరఫున ఆడుతున్న సంజూ శాంసన్ డబుల్ సెంచరీ చేసాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన భారత ఆటగాడిగా శాంసన్ రికార్డు సృష్టించాడు. గోవా జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో 129 బంతుల్లో 21 ఫోర్లు, 10 సిక్సులతో 212 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ఇక ఫ్రొఫెషనల్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన వికెట్‌కీపర్‌గా సంజూ శాంసన్ రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ ఆటగాడు అబిద్ అలీ (209*) పేరిట ఉంది. అంతేకాకుండా సంజు మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. విజయ్ హజారె ట్రోఫీలో అత్యధిక స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. గత సీజన్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన కౌశల్ 202 పరుగులు చేసాడు.
సంజూ శాంసన్ డబుల్ సెంచరీతో చెలరేగడంతో కేరళ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోర్ చేసింది. సచిన్ బేబీ కూడా సెంచరీ (127; 135 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సులు) చేసాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న సంజు.. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటివరకు ఆరు మ్యాచులలో 379 పరుగులు చేసాడు. గత నెలలో జరిగిన వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికా-ఎ జట్టుపై 48 బంతుల్లో 91 పరుగులు చేశాడు.
పరుగుల వరద పారిస్తున్న శాంసన్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత మాజీ క్రికెటర్లు సునిల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్ అతన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. 'దేశవాళీ క్రికెట్ వన్డే మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన శాంసన్‌కి అభినందనలు. సీమ్ బౌలింగ్‌పై అద్భుత టాలెంట్‌తో విరుచుకుపడుతున్నాడు. ఇక టాలెంట్‌కి అవకాశం కూడా తోడవ్వాలి' అని గంభీర్ ట్వీటాడు. 'పంతుకు ప్రత్యామ్నాయ ఎంపిక అవసరమైతే.. నేను సంజు సామ్సన్ గురించి ఆలోచిస్తా. ఎందుకంటే సంజు మంచి కీపర్, బ్యాట్స్ మన్' అని సన్నీ పేర్కొన్నాడు.