IPL 2025: ఐపీఎల్ 2025లో మూడు మ్యాచ్‌లకు వికెట్ కీపింగ్‌కు దూరంగా ఉన్న రాజస్థాన్ రాయల్స్ రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలైన్(సీఈవో) వైపు మొగ్గు చూపాడు. పూర్తిగా ఫిట్‌గా లేకపోవడంతో సంజు శాంసన్ మొదటి మూడు మ్యాచ్‌లకు వికెట్ కీపింగ్, కెప్టెన్సీ బాధ్యతలను వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. సంజు శాంసన్ ఇప్పుడు తన గాయం నుంచి చాలా వరకు కోలుకున్నాడు. ఈ క్రమంలో తన ఫిట్ నెస్‌ను అంచనా వేయడానికి, వికెట్ కీపింగ్‌కు అనుమతి పొందడానికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో సంజు శాంసన్ సోమవారం గౌహతి నుంచి బెంగళూరు చేరుకున్నాడు. ఇక్కడ సంజు శాంసన్ కు ఆమోదం లభిస్తే.. తదుపరి మ్యాచ్‌లలో వికెట్ కీపర్ గా కనిపించడమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీని కూడా తిరిగి తీసుకుంటాడు. సంజు శాంసన్ బొటనవేలు గాయం పూర్తిగా నయమైందని, వికెట్ కీపింగ్ చేపట్టడానికి తగినంత ఫిట్ గా ఉన్నాడని క్రిక్ బజ్ నివేదిక వెల్లడించింది. ఐపీఎల్ తదుపరి మ్యాచ్ లలో వికెట్ కీపింగ్ కోసం సంజు శాంసన్ అనుమతి తీసుకుంటాడని.. ఏప్రిల్ 5న పంజాబ్ కింగ్స్ తో జరిగే మ్యాచ్ లో కెప్టెన్ గా కూడా కనిపిస్తాడని సమాచారం.

ఇంపాక్ట్ ప్లేయర్ గా సంజు శాంసన్
ఈ ఐపీఎల్ సీజన్‌లో బ్యాట్స్‌మన్‌గా ఆడుతున్న సంజు శాంసన్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో 99 పరుగులు చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అతను 37 బంతుల్లో 66 పరుగులు చేసి, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తరువాత కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లతో జరిగిన మ్యాచ్‌లలో వరుసగా 13, 20 పరుగులు చేశాడు. సంజు శాంసన్ లేనప్పుడు ధ్రువ్ జురేల్ జట్టుకు వికెట్ కీపింగ్ చేశాడు.
ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు పేలవమైన ఆరంభాన్ని నమోదు చేసింది. హైదరాబాద్, కోల్‌కతాతో జరిగిన రెండు ప్రారంభ మ్యాచ్ ల్లోనూ ఓడిపోయింది. అయితే చెన్నైతో జరిగి మూడో మ్యాచ్ లో ఆ జట్టు తిరిగి విజయాల బాట పట్టింది. సీఎస్కేపై ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో నితీష్ రాణా జట్టు తరఫున 81 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఏప్రిల్ 5న తన తదుపరి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది.