
హైదరాబాద్: కేరళ యువ క్రికెటర్ సంజూ శాంసన్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ మ్యాచ్ అనంతరం రూ.1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.
దీనిపై శశిథరూర్ తన ట్విట్టర్‌లో "దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మ్యాచ్‌లో తిరువనంతపురుం స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ 48 బంతుల్లో 91 పరుగులు చేశాడు. మైదాన సిబ్బంది శ్రమ వల్లే మ్యాచ్ జరిగిందని అతడు తన మ్యాచ్ ఫీజుని విరాళంగా ఇచ్చాడు. ఇతరులతో పోలిస్తే సంజూ శాంసన్ ప్రత్యేకత అదే. అతడికి ప్రతిభతో పాటు అంకిత భావం కూడా ఉంది" అని ట్వీట్ చేశారు.
ఐదు వన్డేల సిరీస్‌ను భారత్-ఎ 4-1తో కైవసం చేసకున్న సంగతి తెలిసిందే. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో ఇండియా-ఎ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 20 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ 48 బంతుల్లో 91 పరుగులు చేశాడు.
సంజూ శాంసన్‌కి తోడు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (51) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా-ఎ 204 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా-ఎ 168 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్ అనంతరం రూ. 1.5 లక్షలను మైదాన సిబ్బందికి విరాళంగా ఇస్తున్నట్లు సంజూ శాంసన్ ప్రకటించాడు.
ఈ సందర్భంగా సంజూ శాంసన్ మాట్లాడుతూ "మైదానం తడిగా ఉండి ఉంటే మ్యాచ్‌ను రద్దు చేసేవారు. ఈ మ్యాచ్ జరిగిందంటే దానికి కారణం సిబ్బంది. వారికి ధన్యవాదాలు. నా మ్యాచ్ ఫీజుని వారికి విరాళంగా ఇస్తున్నాను" అని అన్నాడు.