
న్యూఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఐపీఎల్‌లో ఓ ముద్దు పేరుందని టీమిండియా యువ ఆటగాడు సంజూ శాంసన్ తెలిపాడు. లీగ్ జరుగుతున్న సమయంలో స్మిత్‌ను 'చాచూ' అని పిలుస్తానని శాంసన్ వెల్లడించాడు. అయితే ఈ ముద్దుపేరు పెట్టింది మాత్రం తాను కాదని.. ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హగ్ అని చెప్పుకొచ్చాడు. స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ స్పిన్నర్ ఇష్ సోధితో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో కేరళ కీపర్ సంజూ శాంసన్ మాట్లాడుతూ... 'స్టీవ్ స్మిత్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. నేనతడిని చాచూ అని పిలుస్తాను. ప్రపంచ క్రికెట్లో అతడిది తెలివైన బుర్ర. మొదట బ్రాడ్ హడ్జ్ ఆయన్ను చాచూ అని పిలిచేవాడు. ఆయన వెళ్లిపోయాక నేనలా పిలుస్తున్నాను. స్మిత్ సైతం నన్ను చాచూ అనే సంబోధిస్తాడు. అతడి కెప్టెన్సీలో ఆడటాన్ని ఆస్వాదిస్తా' అని తెలిపాడు.
'జోస్ బట్లర్ వికెట్ కీపర్ కావడంతో ఆయనెలా ఆటకు సిద్ధమవుతాడో దగ్గరుండి పరిశీలిస్తాను. కీపింగ్, బ్యాటింగ్, రన్నింగ్ సమయాల్లో ఆయన్ను గమనిస్తాను' అని శాంసన్ తెలిపాడు. టీమిండియాకు మళ్లీ ఎంపికవ్వడం గొప్పగా అనిపించిందని శాంసన్ వెల్లడించాడు. విరాట్ భాయ్, రోహిత్ భాయ్‌లాంటి ఆటగాళ్ల మధ్య ఉండటం అద్భుతమైన అనుభవంగా పేర్కొన్నాడు. న్యూజిలాండ్ మ్యాచుల్లో తనపై విశ్వాసంతో సూపర్ ఓవర్లో పంపించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 13వ సీజన్ రద్దు కావడంతో క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమైన విషయం తెలిసిందే.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీలా భావోద్వాగాలను నియంత్రించుకొని బ్యాటింగ్ చేయడాన్ని నేర్చుకుంటున్నానని సంజూ శాంసన్ చెప్పాడు. 'నా సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంతో పాటు మరింత ఏకాగ్రతగా ఉండడాన్ని, వైఫల్యాలను అంగీకరించడాన్ని నేర్చుకున్నా. జట్టును గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నా. బ్యాటింగ్ చేసే సమయంలో ధోనీలా ఏకాగ్రతగా ఉండడంతో పాటు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడాన్ని నేర్చుకుంటున్నా' అని శాంసన్ చెప్పాడు.