రాజస్థాన్ రాయల్స్ నుంచి ఏకంగా రూ.18 కోట్ల భారీ ట్రేడింగ్ విలువతో సీఎస్కే గూటికి చేరిన సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెత్త ప్రదర్శనతో అభిమానులను షాక్‌కు గురిచేస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్‌లో 'ప్లేయర్ ఆఫ్ గి టోర్నమెంట్'గా నిలిచి అద్భుతమైన ఫామ్‌తో టీమిండియాను గెలిపించిన సంజు శాంసన్.. యెల్లో జెర్సీ వేసుకోగానే తన ఫామ్‌ను పూర్తిగా కోల్పోయాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సంజు శాంసన్ ఘోరంగా విఫలమవ్వడం ఇప్పుడు సీఎస్కే జట్టు యాజమాన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఆర్సీబీతో మ్యాచ్..ఆశలు రేపి.. ఆదిలోనే హ్యాండిచ్చాడు!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ నిర్దేశించిన 251 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సంజు శాంసన్‌పై భారీ బాధ్యత ఉంది. క్రీజులోకి రాగానే ఓ అద్భుతమైన సిక్సర్‌తో శుభారంభం పలికినట్లు కనిపించినా.. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. జాకబ్ డఫీ వేసిన బంతిని అనవసరంగా బాడీకి దూరంగా ఆడి.. స్లిప్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్‌కు ఈజీ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేవలం 9 పరుగులకు సంజు శాంసన్ ఔట్ కావడంతో అప్పటికే కష్టాల్లో ఉన్న సీఎస్కే 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఆందోళనలో అభిమానులు
ఈ సీజన్ మొదటి మూడు మ్యాచ్‌ల్లో సంజు శాంసన్ స్కోర్లు గమనిస్తే 6, 7, 9 పరుగులుగా ఉన్నాయి. వరల్డ్ కప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 321 పరుగులు చేసిన ఓ అగ్రశ్రేణి బ్యాటర్.. లీగ్ క్రికెట్‌కు వచ్చేసరికి కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోవడం విచారకరం. రవీంద్ర జడేజా, సామ్ కరన్ వంటి స్టార్ ఆటగాళ్లను వదులుకొని మరి ఏరికోరి సంజు శాంసన్‌ను తెచ్చుకున్న సీఎస్కేకు, అతని ప్రస్తుత ఫామ్ గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పాలి. బంతిని సరిగ్గా టైమింగ్ చేయలేకపోవడం, ఒత్తిడిలో వికెట్లు పారేసుకోవడం సంజు శాంసన్ ఇన్నింగ్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.
కుప్పకూలిన టాపార్డర్.. ఒంటరి పోరాటంలో సర్ఫరాజ్
సంజు శాంసన్ వైఫల్యంతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, యువ ఆటగాడు ఆయుష్ మాత్రే కూడా నిరాశపరచడంతో సీఎస్కే ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. మధ్యలో సర్ఫరాజ్ ఖాన్ కేవలం 24 బంతుల్లో 50 పరుగులు చేసి మెరుపులు మెరిపించినప్పటికీ.. అవతలి వైపు సహకారం లేకపోవడం, భారీ టార్గెట్ ఒత్తిడి కారణంగా సర్ఫరాజ్ కూడా వికెట్ సమర్పించుకున్నాడు. స్టార్ బ్యాటర్ శివం దూబే కూడా త్వరగానే చేతులెత్తేసి పెవిలియన్ బాటపట్టాడు. ఆర్సీబీ బౌలర్లు ముఖ్యంగా జాకబ్ డఫీ.. సీఎస్కే బ్యాటర్ల బలహీనతలను సొమ్ము చేసుకుంటూ మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశారు.
సీఎస్కే కోలుకుంటుందా?
వరుసగా మూడు పరాజయాలతో ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ దిగువకు పడిపోయే ప్రమాదం ఉంది. 251 పరుగుల వంటి రికార్డు స్కోరును నమోదు చేసిన ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతుంటే.. సీఎస్కే మాత్రం తన టాపార్డర్ వైఫల్యాలతో సతమతమవుతోంది. ముఖ్యంగా 18 కోట్ల ఆటగాడు సంజూ శాంసన్ తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా తన ఫామ్‌ను అందుకొని భారీ స్కోర్లు సాధిస్తే తప్ప, చెన్నై ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్ రేసులో నిలవడం కష్టమని విశ్లేషకులు భావిస్తున్నారు.