
ఈ సమయంలో ఐపీఎల్ ఆడుతుండేవాడిని
తాజాగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో సంజూ శాంసన్ మాట్లాడుతూ... 'గత 7-8 సంవత్సరాలుగా నేను ప్రతి ఏడాది ఇదే సమయంలో ఐపీఎల్ ఆడుతుండేవాడిని. అదో గొప్ప అనుభూతి. ఇంట్లో ఏమీ చేయకుండా ఖాళీగా ఉండడం చాలా కష్టం. ఈ పరిస్థితులలో మనల్ని మనం తాజాగా మరియు సంతోషంగా ఉంచుకోవడం ఒక సవాలు. మొదటి రెండు వారాలు కఠినంగా ఉండేవి. అయితే ఇప్పుడు మాత్రం మార్గాలు కనుగొన్నా' అని తెలిపాడు.

దేశ ప్రజల మూడ్‌ని ఐపీఎల్ మార్చగలదు
'ఒక క్రీడాకారుడిగా సాధ్యమైనంత తొందరగా ఆటలు మళ్లీ ప్రారంభంకావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు తెలిసింది క్రికెట్ మాత్రమే. నేను క్రికెట్ ఆటను చాలా ప్రేమిస్తున్నా. ఎప్పుడూ మ్యాచ్‌లు ఆడటాన్ని ఆస్వాదిస్తా. మైదానంకు వెళ్లి ఆడుకోవాలనుకుంటున్నా. అయితే అధికారుల సూచనల్ని గౌరవిస్తూ.. మ్యాచ్‌లు ఆడతాం. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ ప్రజల మూడ్‌ని ఐపీఎల్ మార్చగలదు. లీగ్‌ను త్వరగా మొదలెట్టండి' అని శాంసన్ కోరాడు.

నా జట్టులో ఆడుతావా
కేరళ కీపర్ సంజూ శాంసన్ మాట్లాడుతూ... '2013 ఐపీఎల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. రాహుల్ భాయ్, జుబిన్ భారుచ (ప్రాంఛైజీ చీఫ్) రాజస్థాన్ రాయల్స్‌కు ట్రయల్స్ నిర్వహించారు. అప్పుడు నేను మంచి ఇన్నింగ్స్ ఆడాను. రెండో రోజు ముగిశాక.. రాహుల్ భాయ్ నా వద్దకొచ్చాడు. నా జట్టులో ఆడతావా అని అడిగాడు. నా యదలో వేయి వీణలు మోగినట్లు అనిపించింది. కల నిజమైన భావనతో వెంటనే ఒప్పుకున్నా' అని తెలిపాడు.

ఐపీఎల్ నిరవధిక వాయిదా
అన్ని బాగుంటే ఈ పాటికి ఐపీఎల్ లీగ్ చివరి అంకానికి చేరుకునేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. షెడ్యూల్ ప్రకారం మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభంకావాల్సి ఉండగా.. దేశంలో కరోనా వైరస్ కారణంగా తొలుత ఏప్రిల్ 15కి టోర్నీని బీసీసీఐ వాయిదా వేసింది. ఏప్రిల్ 15 నాటికి కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో.. కేంద్రం లాక్‌డౌన్‌ను మరోసారి పొడగించడంతో ఐపీఎల్ నిరవధికంగా వాయిదా పడింది. టోర్నీ ఎప్పుడు ప్రారంభం అవుతుందో చెప్పలేం.


Click it and Unblock the Notifications












