సంజూ శాంసన్ అవుట్: గంభీర్ నిర్ణయంపై అశ్విన్ ఫైర్!
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్‌ను భారత తుది జట్టు నుంచి తప్పించడంపై ఇప్పుడు భారీ ఎత్తున చర్చ నడుస్కోంగి. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించడం కోసం సంజూ శాంసన్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇటీవల ముగిసిన 2026 టీ20 వరల్డ్ కప్‌లో నాకౌట్ మ్యాచ్‌లలో 3 కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్‌ను ఇలా అకస్మాత్తుగా జట్టు నుంచి తొలగించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై టీమిండియా మాజీ స్పిన్ ఆర్.అశ్విన్ స్పందిస్తూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్నఈ నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి మార్పుల వల్ల జట్టులోని ప్లేయర్లలో అభద్రతాభావం ఏర్పడుతుందని హెచ్చరించారు.
రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో షేర్ చేసిన ఓ వీడియోలో సంజూ శాంసన్‌కు మద్దతుగా గళం విప్పారు. ఈ పరిస్థితిని జట్టు యాజమాన్యం మరింత మెరుగైన రీతిలో హ్యాండిల్ చేసి ఉండాల్సిందని అశ్విన్ అభిప్రాయపడ్డారు. మొదట సూర్యకుమార్ యాదవ్, ఇప్పుడు సంజూ శాంసన్ కూడా జట్టుకు దూరం కావడంతో.. డ్రెస్సింగ్ రూమ్‌లోని మిగిలిన ప్లేయర్లకు కూడా తదుపరి వంతు తమదేనేమోననే భయం పట్టుకుంటుందని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు జట్టు అంతర్గత వాతావరణాన్ని దెబ్బతీస్తాయని.. జట్టులో అసంతృప్తిని పెంచుతాయని అశ్విన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో జట్టు యాజమాన్యం అనుసరించాల్సిన విధానాన్ని వివరిస్తూ అశ్విన్ కీలక సూచనలు చేశారు. "నేనే గనుక అక్కడ ఉండి ఉంటే సంజూ శాంసన్‌తో నేరుగా మాట్లాడేవాడిని. వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు జట్టులోకి రావడానికి తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాడు. కానీ మీరంతా మాకు ప్రపంచ కప్ గెలిపించి తెచ్చారు కాబట్టే అతిడిని ప్రస్తుతానికి బెంచ్ పై కూర్చోబెట్టాం. మీ ముందు ఇంకా రెండు మూడు సిరీస్ లు ఉన్నాయి. ఎవరైతే స్థిరంగా రాణిస్తారో వారే జట్టులో కొనసాగుతారు' అని స్పష్టత ఇచ్చేవాడిని" అని అశ్విన్ స్పష్టం చేశారు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ నుంచి తొలగించడం సరైనదే కావచ్చు కానీ.. అతడిని జట్టు నుంచి పూర్తిగా పక్కన పెట్టడం సరైనది కాదని అశ్విన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. మాంచెస్టర్లో టాస్ పడిన అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్టేడియంలో సంజూ శాంసన్ తో సుదీర్ఘంగా మాట్లాడటం కనిపించింది. జట్టు నుంచి ఎందుకు తప్పించాల్సి వచ్చిందో సంజూ శాంసన్‌కు గంభీర్ నచ్చజెబుతున్నట్లు ఆ దృశ్యాలను బట్టి అర్ధమవుతోంది. అయితే ఈ సంభాషణ అంతటా సంజూ శాంసన్ ముఖంలో తీవ్ర నిరాశ అసంతృప్తి కొట్టొచ్చినట్లు కనిపించాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

