డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్ సంజు శాంసన్ శతకంతో కదం తొక్కాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతేగాక పలు అరుదైన ఘనతలు సాధించాడు. అయితే ఈ రికార్డుల సాధించడానికి అతనికి అండగా నిలిచిన వాళ్ల గురించి శాంసన్ మాట్లాడాడు.
ఓపెనర్‌గా సత్తాచాటడంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడని శాంసన్ తెలిపాడు. సూర్యతో పాటు కోచ్ గౌతమ్ గంభీర్ కూడా తనకి ఎంతో మద్దతు ఇచ్చాడని పేర్కొన్నాడు. తన ఫెయిల్యూర్స్‌లో కూడా కోచ్-కెప్టెన్ అండగా నిలిచారని అన్నాడు. ''కెప్టెన్ సూర్య-కోచ్ గంభీర్ మద్దతు ఎంతో కీలకం. నా వైఫల్యాల్లోనూ వాళ్ల అండగా నిలిచారు. కష్టకాలంలోనూ నాకు మద్దతుగా ఉండే విశేషం. ప్రతికూల దశలో ఓ ఆటగాడు కొన్నిసార్లు ఎంతో నిరాశలో ఉంటాడు''

''అయితే ఆ సమయంలో సూర్య, గంభీర్ నుంచి నాకు ఫోన్‌కాల్స్ వచ్చాయి. నేను దేనిపై సాధన చేయాలో వాళ్లు చెప్పారు. 'బ్రదర్.. నువ్వు స్పిన్‌లో తడబడుతున్నావు. కఠిన పిచ్‌లపై కేరళలోని స్పిన్నర్లందరిని ఎదుర్కో' అని సలహా ఇచ్చాడు. డకౌటైన తర్వాత టీమిండియా కెప్టెన్ కాల్ చేసి, మీ ఆటను మెరుగుర్చుకోమని చెప్పడం ఎంతో ప్రత్యేకమైన విషయం. కెప్టెన్ మనల్ని నమ్ముతున్నాడు, మనం రాణించాలని కోరుకుంటున్నాడని.. మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది''
''నాపై టీమిండియా మేనేజ్మంటె చూపిన నమ్మకానికి కృతజ్ఞుడిని. ఇది ఆరంభం మాత్రమే. మరింత సాధన చేస్తాను. భారత్‌కు మరిన్ని విజయాలు సాధించడానికి కృష్టి చేస్తాను'' అని సంజు శాంసన్ పేర్కొన్నాడు. కాగా, మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 202 పరుగులు చేసింది. సంజు శాంసన్ (107; 50 బంతుల్లో, 7 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కొయెట్జి మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 17.5 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెన్ (25; 22 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.