IND vs NZ: రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. కానీ జట్టులో తన స్థానం కోసం పోరాడుతున్న సంజూ శాంసన్ మాత్రం మరోసారి నిరాశపరిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు సంజూ శాంసన్‌పైనే ఉన్నాయి. శుభ్‌మన్ గిల్‌కు విశ్రాంతి ఇవ్వడంతో ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్.. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు.
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు సంజూ శాంసన్ మెరుపు ఆరంభాన్ని ఇస్తాడని అభిమానులు ఆశించారు. మ్యాట్ హెన్రీ వేసిన తొలి ఓవర్లోనే రెండో బంతికి అద్భుతమైన సిక్సర్ బాది సంజూ శాంసన్ తన ఉద్దేశాన్ని చాటాడు. కానీ ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. అదే ఓవర్ ఐదో బంతికి అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కేవలం 5 బంతుల్లో 6 పరుగులు మాత్రమే చేసి వెనుదిరగడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.

మరోవైపు జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. 76 పరుగులతో విధ్వంసం సృష్టించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. కానీ సంజూ శాంసన్ మాత్రం నాగ్‌పూర్ టీ20లో కేవలం 10 పరుగులకే ఔటయ్యాడు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ తక్కువ స్కోర్లకే పరిమితం కావడంతో సంజూ శాంసన్ స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఇషాన్ కిషన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని 76 పరుగులతో చెలరేగడం సంజూపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.
సంజూ శాంసన్‌కు జట్టులో చోటు దక్కనప్పుడు సోషల్ మీడియాలో పోరాడే అభిమానులు.. ఇప్పుడు అతడి నిర్లక్ష్యపు ఆటను చూసి తలలు పట్టుకుంటున్నారు. "అవకాశాలు పదే పదే రావు సంజూ.. వచ్చినప్పుడు వాడుకోకపోతే ఎలా?" అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. "కీలకమైన సమయంలో బాధ్యతారాహిత్యంగా ఆడటం వల్ల తన కెరీర్‌కే ప్రమాదం" అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ రేసులో ఉండాలంటే సంజూ తన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.