బుడ్డోడికి స్ట్రాంగ్ వార్నింగ్! గౌరవం కావాలంటే ఆ ఒక్కటి చేయాల్సిందే!!
భారత క్రికెట్ విశ్లేషణలో తనదైన శైలిలో విమర్శలు గుప్పించే మాజీ ఓపెనర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి వార్తలు నిలిచారు. గతంలో రవీంద్ర జడేజా వంటి మేటి ఆటగాళ్లను కూడా తన మాటలతో ఇరకాటంలో పడేసిన ఆయన.. ఇప్పుడు 15 ఏళ్ల కుర్రాడు, ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. టీ20 క్రికెట్ ఓ ఆటగాడికి భారీగా డబ్బును, పాపులారిటీని తెచ్చిపెడుతుందేమో కానీ.. క్రికెట్ ప్రపంచంలో నిజమైన గౌరవం మాత్రం కేవలం టెస్ట్ క్రికెట్ ద్వారానే లభిస్తుందని ఆయన కుండబద్ధలు కొట్టారు. తనలాంటి విమర్శకుల మనసు గెలవాలంటే వైభవ్ కేవలం ఫోర్లు, సిక్సర్ల మీద కాకుండా తన టెక్నిక్‌పై దృష్టి పెట్టాలని సూచించారు.
రికార్డుల రారాజు వైభవ్
రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ 2026 సీజన్లో సంచలనం సృష్టిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏకంగా 237.64 స్ట్రైక్ రేట్‌తో 404 రన్స్ బాది ప్రపంచ స్థాయి బౌలర్లను వణికించాడు.జస్ప్రీత్ బుమ్రా వంటి మేటి బౌలర్ల బంతుల్ని కూడా ఏమాత్రం భయం లేకుండా బౌండరీలకు తరలిస్తున్న తీరు చూసి అతడిని వెంటనే టీమిండియాలో చేర్చుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. గతంలో అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగులు సాధించిన చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం టీ20 ఫార్మాట్‌కు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాడని సంజయ్ మంజ్రేకర్ అంగీకరించారు.

టీమిండియాలో ఓపెనింగ్ కష్టాలు.. పోటీని తట్టుకోగలడా?
వైభవ్ సూర్యవంశీ ఆటతీరు అద్భుతంగా ఉన్నప్పటికీ.. భారత జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకోవడం అంత సులభం కాదని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత భారత జట్టులో శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి స్టార్ ఆటగాళ్లు స్థిరంగా రాణిస్తున్నారు. వారితో పాటు మరికొందరు యువకులు కూడా అదే స్థానం కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో, "వైభవ్ ఆటకు సిద్ధంగా ఉండవచ్చు, కానీ జట్టులోని మిగతా వారు అతని కోసం తమ స్థానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారా?" అని సంజయ్ మంజ్రేకర్ సూటిగా ప్రశ్నించారు. కేవలం ఐపీఎల్ ప్రదర్శనతోనే కాకుండా, దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా ఆడితేనే టీమిండియాలో సుస్థిర స్థానం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
టెక్నిక్ లోపం.. విదేశీ గడ్డపై ఆ షాట్లు పని చేయవు!
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిలోని లోపాలను ఎత్తి చూపుతూ సంజయ్ మంజ్రేకర్ కీలక హెచ్చరికలు చేశారు. వైభవ్ బంతికి దూరంగా ఉండి మిడిల్ స్టంప్ బంతుల్ని పాయింట్ దిశగా కొట్టడం టీ20లు సరిపోతుందని.. కానీ టెస్ట్ క్రికెట్లో ఇది పెద్ద బలహీనతగా మారుతుందని విశ్లేషించారు. "ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లేదా దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో స్వింగ్ అయ్యే బంతుల్ని ఎదుర్కోవాలంటే బంతి లైన్‌కు దగ్గరగా వెళ్లడం తప్పనిసరి. బంతికి దూరంగా ఉండి ఆడితే అక్కడ పరుగులు రావు సరికదా.. వికెట్ పారేసుకునే ప్రమాదం ఉంది" అని సంజయ్ మంజ్రేకర్ హెచ్చరించారు.
డబ్బు కావాల్నా.. గౌరవం కావాలా?
చివరగా నేటి తరం క్రికెటర్ల ఆలోచనా విధానంపై సంజయ్ మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "నీ బిడ్డ ఫేమస్ కావాలి, కోట్లు సంపాదించాలి అని అనుకుంటే టీ20 బ్యాటింగ్ నేర్పించండి. కానీ మాలాంటి విమర్శకులు మరియు క్రికెట్ పండితుల నుంచి గౌరవం పొందాలంటే మాత్రం టెస్ట్ క్రికెట్‌లో సత్తా చాటాలి" అని మంజ్రేకర్ అన్నారు. 15 ఏళ్ల పిల్లాడికి క్రికెట్ విలువలను నేర్పే క్రమంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారాయి. సంజయ్ మంజ్రేకర్ విమర్శలు వైభవ్ సూర్యవంశీ ఎదుగుదలకు తోడ్పడతాయా లేదా అన్నది వేచి చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications