సొంతగడ్డపై భారత్‌కు ఊహించని పరాభవం. పుష్కరకాలం తర్వాత టెస్టు సిరీస్‌ను కోల్పోయింది. స్వదేశంలో వరుసగా 18 సిరీస్‌లు గెలిచిన టీమిండియా జైత్రయాత్రకు తెరపడింది. పుణె టెస్టులో న్యూజిలాండ్ చేతిలో 113 పరుగుల తేడాతో ఓటమిపాలై మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే చేజార్చుకుంది. ఓవరాల్‌గా 2012 తర్వాత సొంతగడ్డపై టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది.
అయితే పుణె టెస్టులో రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. డిఫెన్సివ్ ఫీల్డింగ్ సెటప్ చేస్తున్నాడని, రోహిత్ ఓ నెగటివ్ కెప్టెన్ అని సునీల్ గవాస్కర్ మండిపడ్డ విషయం తెలిసిందే. రవిశాస్త్రి, దినేశ్ కార్తీక్ కూడా కామెంటరీలో ఇదే వ్యాఖ్యలు చేశాడు. ఎటాకింగ్ ఫీల్డింగ్‌ను మోహరించి వికెట్లు సాధించేలా చేయకుండా, డిఫెన్సివ్ మైండ్ సెట్‌తో సారథిగా వ్యవహరించాడని అన్నారు.

ఇక నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడంపై మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్టు ఫార్మాట్‌లో టీ20 కెప్టెన్సీ విధానాన్ని అమలు చేయడమేంటని ప్రశ్నించాడు. రైట్-లెఫ్ట్ హ్యాండర్ కాంబినేషన్ కాకుండా ఆటగాళ్ల సామర్థ్యాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు. ఛేదనలో సర్ఫరాజ్ ఖాన్ కంటే ముందు వాషింగ్టన్ సుందర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో రోహిత్ ప్రమోట్ చేశాడు. పంత్ ఔటవ్వడంతో కోహ్లితో ఎడమచేతి వాటం బ్యాటర్ క్రీజులో ఉంటే కలిసొస్తుందని రోహిత్ ఆలోచించాడు.
''సర్ఫరాజ్ ఖాన్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో వెనక్కినెట్టి, ఎడమచేతి వాటం బ్యాటర్ అనే కారణంగాతో వాషింగ్టన్ సుందర్‌ను అతని కంటే ముందు పంపించడం జరగకూడదు. ఇది వింతగా ఉంది. ఈ విషయంలో రోహిత్ శర్మ జాగ్రత్తగా ఆలోచించాలి. టీ20ల్లో తరహాలో లెఫ్ట్-రైట్ హాండ్ బ్యాటర్ల కాంబినేషన్ చేయడం కాదు. ఆటగాళ్ల నాణ్యత, వాళ్ల సామర్థ్యాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాలి'' అని సంజయ్ మంజ్రేకర్ అన్నాడు.

పుణె టెస్టులో 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 113 పరుగుల తేడాతో ఓడింది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) సత్తాచాటారు. భారత బౌలర్లలో సుందర్ ఏడు, అశ్విన్ మూడు వికెట్లు తీశారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైంది. జడేజా (38) టాప్ స్కోరర్. మిచెల్ శాంట్నర్ ఏడు వికెట్లతో విజృంభించాడు.
రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 పరుగులు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్ (86) టాప్ స్కోరర్. సుందర్ నాలుగు, జడేజా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో భారత్ 245 పరుగులకే పరిమితమైంది. యశస్వీ జైస్వాల్ (77), రవీంద్ర జడేజా (42) పోరాడారు. మిచెల్ శాంట్నర్ ఆరు వికెట్లతో చెలరేగాడు.