
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ అనంతరం మంజ్రేకర్ ట్వీట్ చేస్తూ 50 ఓవర్ల మ్యాచ్ చూస్తున్న ప్రతిసారీ పది ఓవర్లు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోందని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఇంకేముంది సోషల్‌మీడియా వేదికగా మంజ్రేకర్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. "వన్డే మ్యాచ్‌ను టెస్ట్‌లా ఆడే నువ్వు కూడా ఇలా మాట్లాడుతావా?" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... మరొక నెటిజన్ "మీరు కామెంట్రీ బాక్స్‌లో ఉన్నప్పుడు నా స్నేహితుడితో నేను కూడా ఇలాగే అంటుంటా" అని ట్వీట్ చేశాడు.
"మీరు చెప్పింది నిజమే.. ఎందుకంటే మీరెప్పుడూ పట్టుమని పది ఓవర్లు కూడా ఆడలేదు కదా" అని మరొక నెటిజన్ కామెంట్ చేశాడు. "40 ఓవర్లు అయ్యాక నువ్వు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని, నిజంగా 40 ఓవర్ల మ్యాచ్ ఉన్నా నువ్వు ఇలాంటి డైలాగే చెబుతావని, నీ ట్వీట్లు ఎప్పుడూ ఇలానే ఉంటాయా?" నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.