టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు చూసి జీర్ణించుకోలేకే అతనిపై ఒత్తిడి తెచ్చి కెప్టెన్సీ నుంచి తప్పుకునేలా చేశారని ఇటీవల టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. రవిశాస్త్రి లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భారత క్రికెట్‌కు మంచిది కాదన్నాడు. రవిశాస్త్రి వ్యాఖ్యలను మంజ్రేకర్ ఖండించాడు. నిజానికి రవిశాస్త్రిని విమర్శించాలనే ఆలోచన తనకు లేదని, అతని కెప్టెన్సీలో తాను కూడా ఆడానని మంజ్రేకర్ చెప్పాడు. రవిశాస్త్రికి తాను మంచి అభిమానినని, కెప్టెన్‌గా శాస్త్రి ఎప్పుడూ ఆటగాళ్లకు మద్దతుగా నిలిచేవాడని గుర్తు చేసుకున్నాడు. కానీ ఇటీవల రవిశాస్త్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అలాగే శాస్త్రిని కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని తెలిపాడు. కానీ రవి శాస్త్రి 2.0 వెర్షన్‌ను ఎంటో తనకు అర్థం కావడం లేదని ఆయన తెలిపాడు. అయితే రవిశాస్త్రి ఎప్పుడూ కూడా తెలివైన వ్యాఖ్యలు చేయడని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
అసలు రవిశాస్త్రి ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ కచ్చితంగా మరో రెండేళ్లు టీమిండియా టెస్టు కెప్టెన్‌గా జట్టును నడిపించేవాడని తెలిపాడు. అయితే రానున్న రెండేళ్లలో టీమిండియాకు అన్ని హోం సిరీస్‌లే ఉన్నాయని, అవి కూడా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బాగా వెనుక ఉన్న జట్లతో అని చెప్పాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో కోహ్లీ విజయాల సంఖ్య 50 నుంచి 60కి పెరిగేది అన్నాడు. కావున కోహ్లీకి అలాంటి రికార్డులు దక్కడం ఇష్టం లేక, అతడు సాధించిన ఘనతలు చూసి జీర్ణించుకోలేక, కొందరు అతడిపై ఒత్తిడి తెచ్చి కెప్టెన్సీ నుంచి తనకు తానుగా తప్పుకునేలా చేశారని వ్యాఖ్యానించాడు. దీంతో రవిశాస్త్రి చేసిన ఈ వ్యాఖ్యలు వివాదస్పద కావడంతో పలువురు ఖండించారు.
కాగా సౌతాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు 1-2తో ఓటమి పాలైంది. సిరీస్ ఓడిన తర్వాతి రోజే తాను టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. కోహ్లీ అంతకు ముందే వన్డే, టీ20 కెప్టెన్సీకి దూరమయ్యాడు. దీంతో ప్రస్తుతం కెప్టెన్సీకి కోహ్లీ పూర్తిగా దూరమయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీకి, బీసీసీఐ మధ్య విబేధాలు వచ్చాయనే వార్తలు కూడా వైరల్‌గా మారాయి. ప్రత్యక్షంగానే కెప్టెన్సీ విషయమై విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య మాటల యుద్ధం నెలకొంది. దీంతో విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.