
లండన్: ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడం.. విమర్శకుల నోటికి పని చెప్పింది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌లో కనీసం ప్రతిఘటన కూడా ఇవ్వకుండా చేతులెత్తేయడం పట్ల మాజీ క్రికెటర్లు ఆందోళన వ్యక్త చేస్తోన్నారు. తొలి ఇన్నింగ్ బ్యాటింగ్.. బౌలింగ్.. ఈ రెండు విభాగాల్లో నాసిరకం ఆటతీరును ప్రదర్శించింది టీమిండియా. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన 78 పరుగులకు కుప్పకూలిపోయింది.
ప్రత్యేకించి- కేప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ వైఫల్యం అభిమానులనే కాదు.. టీమిండియా మాజీ ప్లేయర్లు, లెజెండరీ క్రికెటర్లను కూడా కలవరపెడుతోంది. మాటల దాడికి కారణమౌతోంది. ఇదివరకే లెజెండరీ బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్.. విరాట్ కోహ్లీకి కొన్ని సూచనలు చేశాడు. సలహాలను ఇచ్చాడు. వరుస వైఫల్యాల నుంచి ఎలా బయటపడాలనే విషయాన్ని సచిన్ టెండుల్కర్‌ను అడిగి తెలుసుకోవాలని చెప్పుకొచ్చాడు గవాస్కర్.
తాజాగా అదే జాబితాలో మరో టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేరాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లోపాలను ఎత్తి చూపాడు మంజ్రేకర్. టెక్నికల్‌గా తనకు ఉన్న బలహీనతల నుంచి బయటపడటానికి ప్రయత్నించట్లేదని అన్నాడు. ఆఫ్ స్టంప్ మీద వచ్చిన బంతులను కవర్ డ్రైవ్‌గా మలచడంలో విరాట్ కోహ్లీ తడబడుతున్నాడని, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అదే సమయంలో- నేరుగా కీపర్ చేతుల్లోకి వెళ్తోన్న బంతులను వదిలేయలేకపోవడం కోహ్లీకి ఉన్న మరో బలహీనతగా అభివర్ణించాడు.
ఊరించే బంతులతో అసలు ప్రమాదం ఉంటుందని, వాటిని సమర్థవంతంగా ఆడకపోతే చేదు ఫలితాలను చవి చూడాల్సి ఉంటుందని మంజ్రేకర్ పేర్కన్నాడు. ఎందరో బ్యాటింగ్ లెజెండరీలకు ఉన్న బలహీనతే కోహ్లీకి కూడా ఉందని వ్యాఖ్యానించాడు. సునీల్ గవాస్కర్, సర్ వివియన్ రిచర్డ్స్ ఇలా చాలామంది బ్యాట్స్‌మెన్లకు ఉన్నట్టే కోహ్లీకి కూడా ఆఫ్ స్టంప్‌కు కాస్త అవతలగా వెళ్తోన్న బంతులను డ్రైవ్ చేయాలనే బలహీనత ఉందని అన్నాడు.
2018లో విరాట్ కోహ్లీ టన్నుల కొద్దీ పరుగులు చేయడానికి ప్రధాన కారణం.. అతను ఊరించే బంతుల జోలికి వెళ్లకపోవడమేనని సంజయ్ మంజ్రేకర్ స్పష్టం చేశాడు. ఆఫ్ స్టంప్‌పై పడిన బంతులను అద్భుతంగా.. అంతకుమించి అందంగా కవర్ డ్రైవ్ చేసే వాడని, ఇప్పుడా టెక్నిక్‌ను మళ్లీ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఆస్ట్రేలియాలో మిఛెల్ జాన్సన్ సంధించిన బంతులను ఆడాలని కోహ్లీ తాపత్రయ పడలేదని గుర్తు చేశాడు.
ఇప్పుడు అలాంటి బంతులనే విసురుతోన్న జేమ్స్ అండర్సన్‌కు కోహ్లీ ధీటుగా సమాధానం చెప్పలేకపోతోన్నాడని వ్యాఖ్యానించాడు. పాత బలహీనతలను మరోసారి కోహ్లీని పట్టి పీడిస్తున్నట్టు కనిపిస్తోందని పేర్కొన్నాడు. అతని చివరి సెంచరీ తరువాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 23.00గా నమోదైంది. చివరి 18 ఇన్నింగుల్లో మూడుసార్లు డకౌట్ అయ్యాడు.. మరో నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పెవిలియన్ బాట పట్టాడు. 641 రోజుల్లో విరాట్ కోహ్లీ చేసింది కేవలం మూడు హాఫ్ సెంచరీలే. అన్ని ఫార్మట్లలో కలిపి 50 ఇన్నింగులు ఆడినా ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు బ్యాటింగ్ మిషన్.