
సౌతాఫ్రికా పర్యటనలో ఘోరంగా విఫలమైన టీమిండియా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటు అభిమానులతోపాటు అటు మాజీ ఆటగాళ్లు కూడా రహానే ఆటను దుయ్యబడుతున్నారు. అభమానులైతే రహానే ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిందేనని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రహానే ఆట తీరుపై భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. తాను రహానేకు మరో అవకాశం ఇవ్వనని చెప్పాడు. ఇప్పటికే రహానేకు చాలా అవకాశాలు ఇచ్చారని, అయినా అతను నిరుపించుకోలేక పోయాడని తెలిపాడు.
అందుకే రహానేకు మరో అవకాశం ఇవ్వకూడదని రాసుకొచ్చాడు. అంతేకాకుండా రహానే తన ఫామ్ తిరిగి పొందడానికి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాలని మంజ్రేకర్ సూచించాడు. గత మూడు, నాలుగేళ్లలో రహానే అంతగా రాణించలేకపోయాడని అన్నాడు. అతడు తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే ఆశ కూడా లేదని చెప్పుకొచ్చాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో మెల్‌బోర్న్ వేదికగా సాధించిన సెంచరీ తప్ప అతను మళ్లీ ఎప్పుడూ రాణించలేదని గుర్తు చేశాడు.
కాగా సౌతాఫ్రికా పర్యటనలో రహానే ఘోరంగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో 48, 20 పరుగులు చేశాడు. ఇక రెండో టెస్టులో 0, 58 పరుగులు చేశాడు. ఇక మూడో టెస్టులో 9, 1 పరుగులు చేశాడు. గత రెండేళ్ల కాలంలో రహానే తన కెరీర్‌లో అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్నాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. ఇక కేప్‌టౌన్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే టీమిండియాకు ఈ మ్యాచ్‌లో ఓటమి తప్పేలా లేదు. బ్యాటింగ్ వైఫల్యం జట్టు కొంపముంచింది.
మూడో టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్, విరాట్ కోహ్లీ మినహా మరో బ్యాటర్ రాణించలేకపోయాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌట్ అయిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అంతకంటే దారుణంగా 198 పరుగులకే ఆలౌటైంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ మినహా మరో బ్యాటర్ రాణించలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌లో పంత్ అజేయ సెంచరీతో చెలరేగాడు. అతనికి మిగతా బ్యాటర్లు ఎవరు కనీస సహకారం కూడా అందించలేదు.
అనంతరం 212 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన అతిథ్య జట్టు సౌతాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. క్రీజులో పీటర్సన్ 48 పరుగులతో ఉన్నాడు. 30 పరుగులు చేసిన కెప్టెన్ ఎల్గర్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇక మరో ఓపెనర్ మాక్రమ్ 16 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు.