న్యూఢిల్లీ: కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ సహ యజమాని ప్రీతి జింతా తనను తిట్టినట్లుగా వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆ జట్టు కోచ్ సంజయ్ బంగర్ గురువారం నాడు చెప్పాడు. ఈ నెల 9వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడింది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఓటమిని జీర్ణించుకోలేక ప్రీతి జింతా.. బంగర్‌ను తిట్టినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై బంగర్ సోషల్ మీడియాలోను స్పందించారు.
మ్యాచ్ ఓడిపోయిన అనంతరం ఓటమికి గల కారణాల పైన జట్టు యాజమాన్యంతో చర్చ జరిగిందని, అయితే మీడియాలో మాత్రం ఇందుకు విరుద్దంగా వచ్చిందని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. ప్రీతి జింతా తనను తిట్టినట్లుగా వార్తలు వండి వార్చారని చెప్పాడు.

ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడం ఎవరికైనా బాధాకరమే అన్నాడు. జట్టు మాత్రం రాణించిందని చెప్పాడు. మిగతా మ్యాచులలో రాణిస్తామని, సత్తా చాటుతామని చెప్పాడు. ఈ విషయాన్ని సంజయ్ బంగర్ తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.
మరోవైపు ప్రీతిజింతా కూడా ఆ వార్తలను ఖండించారు. తాను దూషించలేదన్నారు. అలాంటి పనులు తాను ఎప్పుడూ చేయలేదని ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు. ఇటువంటి వార్తలను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
కాగా, మ్యాచ్‌లలో ఇష్టం వచ్చినట్లు బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం, రాణిస్తున్న అక్షర్ పటేల్‌ను కాదని బెహార్డిన్‌ను బ్యాటింగుకు పంపడం ప్రీతిజింతాకు కోపం తెప్పించిందని వార్తలు వచ్చాయి. ఆమె తన నోటికి పని చెప్పడంతో సమాధానం చెప్పలేక బంగర్ వెళ్లిపోయాడని వార్తలు వచ్చాయి. దీనిని ఇరువురు ఖండించారు.