Sanjay Bangar: టీమిండియా స్ఠార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ 4వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. 2013లో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో టెస్టుల్లో నాలుగో స్థానంలో ఉత్తమ ప్రత్యామ్నాయం ఎవరనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. కేఎల్ రాహుల్ లేదా శుభ్‌మన్ గిల్ ఆ స్థానంలో బ్యాటింగ్ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక ప్రకటన చేశారు.
కేఎల్ రాహుల్ లేదా శుభ్‌మన్ గిల్ కాకుండా 33 ఏళ్ల కరుణ్ నాయర్‌ను విరాట్ కోహ్లీకి ప్రత్యామ్నాయంగా సంజయ్ బంగర్ భావిస్తున్నారు. ఐపీఎల్ తర్వాత 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉందనే సంగతి తెలిసిందే. కరుణ్ నాయర్ చాలా కాలంగా భారత జట్టుకు దూరంగా ఉన్నాడు. కరుణ్ నాయర్ 2017లో భారత్ తరఫున తన చివరి మ్యాచ్ ఆడాడు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన కరుణ్ నాయర్‌ను ఇంగ్లాండ్ పర్యటన కోసం ఇండియా ఏ జట్టులో చేర్చారు. ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, భారత సీనియర్ జట్టుతో ఒక ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది.

"కరుణ్ నాయర్‌ను 4వ స్థానంలో ఆడించాలని భావిస్తున్నాను. దేశీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, దానిని ఒక ప్రమాణంగా ఉపయోగించడం గురించి మాట్లాడితే కరుణ్ నాయర్ టెస్ట్ క్రికెట్‌లో తన స్థానాన్ని తిరిగి పొందడానికి సాధ్యమైనదంతా చేశాడు." అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారతీయుడిగా కరుణ్ నాయర్ నిలిచాడు. కరుణ్ నాయర్ భారత్ తరఫున 6 టెస్టులు, రెండు వన్డేలు ఆడాడు. కరుణ్ నాయర్‌తో పాటు అభిమన్యు ఈశ్వరన్‌ను భారత జట్టులో చేర్చాలని సమర్థించాడు. అభిమన్యు ఈశ్వరన్ కూడా దేశీయ క్రికెట్‌లో అద్భుతమైన ప్రభావాన్ని చూపాడు. అభిమన్యు ఈశ్వరన్ కూడా టెస్ట్ జట్టులోకి వస్తాడని నమ్మకం ఉందని మాజీ కోచ్ అన్నాడు.