బెంగళూరు: యూఎస్ ఓపెన్‌లో మిక్స్ డ్ డబుల్స్ తో పాటు మహిళల డబుల్స్ టైటిల్ భారత్ ఖాతాలో చేరడంపై మాజీ క్రికెట్ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ హర్షం వ్యక్తం చేశాడు. ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్‌లో మార్టీనా హింగీస్‌తో కలిసి సానియా మీర్జా మహిళల డబుల్స్ టైటిల్‌ను గెలుపొందింది.
అలాగే లియాండర్ పేస్ కూడా మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను హెంగీస్‌తో కలిసి చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. వీరి గెలుపు భారత్‌లోని క్రీడాకారుల్లో ఎంతో స్ఫూర్తిని నింపుతుందని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.
బెంగళూరులో సోమవారం జరిగిన ఓ క్రీడాకార్యక్రమాకి హాజరైన ద్రవిడ్ మీడియాతో మాట్లాడాడు. సానియా, లియాండర్ పేస్‌ల విజయం కేవలం టెన్నిస్‌కే పరిమితం కాదని, యావత్తు దేశంలో క్రీడలపైనే ప్రభావం చూపుతుందన్నాడు.

తొలుత శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్లో నాలుగోసీడ్ పేస్-హింగిస్ 6-4, 3-6, 10-7తో అన్‌సీడెడ్ బెథానీ మాటెక్ సాండ్స్-సామ్ క్వైరీ (అమెరికా)పై విజయం సాధించి యూఎస్ ఓపెన్‌ను గెలుపొందింది.
ఆదివారం జరిగిన యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగీస్ ద్వయం 6-3, 6-3తో నాలుగో సీడ్ కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా)-యారోస్లావా ష్వెదోవా (కజకిస్తాన్) జంటను ఓడించింది. ఈ విజయాలతో గ్రాండ్ స్లామ్ కెరీర్‌లో లియాండర్ పేస్ 17వ టైటిల్ ను సాధించగా, సానియా ఖాతాలో 5వ గ్రాండ్ స్లామ్ వచ్చి చేరింది.
సానియాపై బాలీవుడ్ ప్రశంసలు
ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించిన సానియామీర్జా- మార్టినా హింగీస్ జోడీపై బాలీవుడ్ ప్రశంసల వర్షం కురిపించింది. బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, ప్రియాంకా చోప్రా, ఫరాఖాన్, వరుణ్‌ధావన్, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ ఫర్హాన్ అక్తర్ తదితరులు సానియామీర్జాకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.