సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఒకటి రెండు సంవత్సరాల తేడాతో అడుగు పెట్టిన శ్రీలంక క్రికెటర్లు కుమార సంగక్కర, మహేల జయవర్ధనేలు ఒకేసారి వన్డేల నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. సంగక్కర, జయవర్ధనేలు మైదానంలో, బయట కూడా మంచి స్నేహితులే.
ఈ ఇద్దరు దిగ్గజాలు మైదానంలో, బయట ఒకరికొకరు సహకరించుకుంటారు. సంగక్కర, జయవర్ధనేలు ఎవరు సారథులుగా ఉన్నా.. మరొకరు ఫీల్డింగ్ మొహరించడం, స్వేచ్ఛగా సూచనలు ఇవ్వడం చేసేవారు. టెస్టుల్లో సచిన్ - ద్రావిడ్ (6920) తర్వాత రెండో విజయవంతమైన జోడీ మహేల-సంగక్కరది (6654).
వన్డేల్లో సచిన్ - సౌరవ్ గంగూలీ (8227) తర్వాత స్థానం జయవర్ధనే - సంగక్కరలదే (5992). ఇద్దరు అహానికి చోటివ్వకుండా ఒకరికి మరొకరు సహకరించుకునే వారు. అంతర్జాతీయ క్రికెట్లో వీరిద్దరి జోడీది 15 ఏళ్ల ప్రస్థానం. ఎక్కడైనా ఇద్దరు కలిసి ఉంటారు.

అంతర్జాతీయ ఆటగాళ్ల మధ్య ఎంత స్నేహం ఉన్నప్పటికీ.. మైదానంలో కలిసి ఉన్నప్పటికీ.. దాదాపు అందరివీ బయట మాత్రం ఎవరి వ్యాపకాలు వారివే. మహేల - సంగక్కరలు మాత్రం.. కలిసి ఓ రెస్టారెంట్ ప్రారంభించారు.
సంగక్కర ప్రస్తుత ప్రపంచ కప్‌లో ప్రకంపనలు సృష్టంచిన వెటరన్ బ్యాట్స్‌మన్. ప్రపంచ కప్‌లో వరుసగా నాలుగు సెంచరీలు చేసి రికార్డ్ సృష్టించాడు. ఈ వరల్డ్ కప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌లో 541 పరుగులు చేసి అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మన్‌గా ఉన్నాడు.
2000లో పాకిస్తాన్ మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2007లో హోబర్ట్‌లో ఆస్ట్రేలియాపై సంగక్కర 192 పరుగులు చేశాడు. 2007లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెం:1ను కైవసం చేసుకున్నాడు. చిరకాల మిత్రుడు జయవర్దనె కెప్టెన్సీలో సంగా కెరీర్ దూసుకెళ్లింది. టెస్టులు, వన్డేల్లో పరుగుల వరద పారించాడు.
2014లో బంగ్లాదేశ్‌తో టెస్టులో ట్రిపుల్ సెంచరీ (317)తో అదరగొట్టాడు. జయవర్దనె తర్వాత జట్టు బాధ్యతలు చేపట్టిన సంగక్కర శ్రీలంకను విజయాల బాట పట్టించడంలో కీలక పాత్ర పోషించాడు. 404 వన్డేలు ఆడిన సంగక్కర మొత్తం 14,234 పరుగులతో సచిన్ (18,426) తర్వాతి స్థానంలో ఉన్నాడు. 130 టెస్టులు ఆడి 12,203 పరుగులు చేశాడు. మొత్తం 11 టెస్టు ద్విశతకాలతో బ్రాడ్‌మన్ (12) తర్వాతి స్థానం సొంతం చేసుకున్నాడు.
శ్రీలంకకు జయవర్ధనే వెన్నెముక. సాంకేతికంగా, సొగసైన ఆటగాడు. 2006లో ఐసీసీ కెప్టెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నాడు. 2007 విజ్డెన్ టాప్-5 క్రికెటర్లలో జయవర్దనెకు చోటు దక్కించుకున్నాడు. 1997లో భారత్‌తో జరిగిన చారిత్రక టెస్టు మ్యాచ్‌లో మహేల అరంగేట్రం చేశాడు.
ఆ మ్యాచ్‌లో లంక 952/6తో ప్రపంచ రికార్డు సృష్టించింది. 2003లో ఫాం కోల్పోయి ప్రపంచ కప్ జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఆ తర్వాతి ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో ఫాంలోకి వచ్చాడు. 2006 టెస్టులు, వన్డేల్లో లంక కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో అత్యధికంగా 374 పరుగులు సాధించి లంక బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
సఫారీలతో మ్యాచ్‌లో సంగక్కరతో కలసి 624 పరుగుల చారిత్రక భాగస్వామ్యం నెలకొల్పాడు. 2007 వరల్డ్ కప్‌లో కెప్టెన్‌గా లంకను ఫైనల్‌కు చేర్చాడు. సచిన్ తర్వాత 600 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక్క క్రికెటర్. 2012లో స్వదేశంలో జరిగిన టి-20 ప్రపంచకప్‌లో లంకను ఫైనల్ చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు.
2014 టి-20 వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర వహించాడు. 448 వన్డే మ్యాచ్‌ల్లో 12,650 పరుగులు సాధించాడు. 17 ఏళ్ల టెస్టు కెరీర్‌లో 149 మ్యాచ్‌ల్లో 11,814 పరుగులు సాధించాడు. 2014లో టెస్టుల నుంచి రిటైరయ్యాడు.