టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలకమైన సూపర్ 8 పోరుకు భారత్ సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ లో జరగనున్న ఈ మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుకు డూ ఆర్ డైగా సమరంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. జింబాబ్వేపై భారీ విజయంతో సెమీఫైనల్ ఆశలు మొలకెత్తాయి. ఇప్పుడు సెమీఫైనల్ ఎంట్రీ పాస్ కోసం వెస్టిండీస్ తో తలపడాల్సి ఉంది. భారత్, వెస్టిండీస్ రెండూ దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయిన జట్లే.
ఇప్పటికే ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, తమ సెమీఫైనల్ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. శనివారం రాత్రి పల్లెకెలెలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచినప్పటికీ- నెట రన్ రేట్ సాధించకపోవడం వల్ల ఆ జట్టు కూడా సెమీస్ రేసు నుంచి తప్పుకొంది. దీంతో మెరుగైన నెట్ రన్ రేట్ ఉండటం వల్ల న్యూజిలాండ్ సెమీస్ కు అర్హత సాధించింది. దీంతో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా సరసన చేరింది న్యూజిలాండ్. ఈ ముడు జట్లూ సెమీస్ చేరాయి.

ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెడ్ కోచ్ సనత్ జయసూర్య గుడ్ బై చెప్పారు. తన పదవికి రాజీనామా చేశారు. పాకిస్తాన్‌తో ప్రపంచ కప్ చివరి మ్యాచ్‌లో ఓటమి, జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన వెంటనే ఈ విషయాన్ని ప్రకటించారు. వాస్తవానికి ప్రపంచ కప్ తన చివరి అసైన్‌మెంట్ అని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారు గానీ బోర్డుకు అధికారికంగా తెలియజేయలేదు.
మ్యాచ్ ముగిసిన వెంటనే సనత్ జయసూర్య మాట్లాడాడు. బాధ్యతలను వేరొకరికి అప్పగించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. హెడ్ కోచ్ గా ఎక్కువ కాలం ఉండబోనని రెండు నెలల క్రితం ఇంగ్లాండ్ సిరీస్‌లోనే చెప్పానని, అప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రపంచ కప్‌లో మెరుగైన ప్రదర్శన చేసి కోచ్‌గా మంచి ముగింపు ఇవ్వాలనుకున్నానని, అది సాధ్యపడలేదని పేర్కొన్నారు. దానికి బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు.
మార్చి 13న ఆఫ్ఘనిస్తాన్‌తో శ్రీలంకకు సిరీస్ ఆరంభం కావాల్సి ఉంది. అప్పటివరకు అతను కొనసాగే అవకాశాలు దాదాపుగా లేవు. తాను వెంటనే తప్పుకొంటానని చెప్పారు జయసూర్య. ఆయన కాంట్రాక్ట్ జూన్ వరకు ఉంది. రాజీనామా విషయం శ్రీలంక బోర్డుకు అధికారికంగా తెలియజేయలేదని, ఈ నిర్ణయంపై వారితో చర్చించాల్సి ఉందని చెప్పారు.
2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత జయసూర్య శ్రీలంక ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. మొదటి కొన్ని నెలల్లోనే శ్రీలంక పలు విజయాలు సాధించింది. 2024 ఆగస్టులో భారత్ పై వన్డే సిరీస్ గెలిచింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో స్వదేశంలో న్యూజిలాండ్‌ను టెస్టుల్లో 2-0తో మట్టికరిపించింది. వన్డే ఐసీసీ ర్యాంకింగ్స్ లల్లో టాప్ 10లో చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించలేదు గానీ నాలుగో స్థానానికి ఎగబాకింది. టెస్ట్ జట్టు కూడా ఎనిమిదో స్థానంలో నిలిచింది.