కోల్‌కతా: ఇంగ్లండ్ పైన ప్రపంచ కప్ ట్వంటీ 20లో గెలిచిన అనంతరం వెస్టిండీస్ ఆటగాడు మార్లోన్ సామ్యూల్స్.. మీడియాకు కాళ్లు చూపుతూ మాట్లాడాడు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైకులు పెట్టే టేబుల్ పైన రెండు కాళ్లూ ఎత్తి పెట్టుకుని నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పాడని విమర్శలు వస్తున్నాయి.
సామ్యూల్స్‌తో పాటు భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల మీడియా సమావేశంలో వ్యవహరించిన తీరు పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విండీస్‌తో ఓటమి అనంతరం ధోనీ ఓ ఆస్ట్రేలియా జర్నలిస్టుతో విచిత్రంగా ప్రవర్తించాడు. తన రిటైర్మెంటు గురించి ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు. దానికి ధోనీ మాట్లాడుతూ.. వికెట్ కీపరైన కొడుకుగానీ, తమ్ముడు గానీ నీకు ఉన్నారా? నా రిటైర్మెంటు వల్ల వారికి ఏమైనా లబ్ధి చేకూరుతుందా అని ప్రశ్నించాడు.
తన పక్కన కూర్చోబెట్టుకొని ఆ జర్నలిస్టుతోనే ధోనీ సమాధానం చెప్పించాడు. ఇది ఓ రకంగా అసహనం వల్లే అని అంటున్నారు. అయితే, ఫిట్‌గా ఉన్నప్పటికీ ఇన్నిసార్లు రిటైర్మెంటు పైన ప్రశ్నిస్తే.. ధోనీకే కాదు ఎవరికైనా కోపం వస్తుంది అని అభిమానులు అంటున్నారు.

మరోవైపు, ఫైనల్ మ్యాచులో 66 బంతుల్లో 85 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన విండీస్ ఆటగాడు సామ్యూల్స్ కూడా అహంభావంతో వ్యవహరించారని అంటున్నారు.
ఆసిస్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్, ఇంగ్లాండ్ బౌలర్ బెన్ స్టోక్స్ పైన విమర్శలు గుప్పించిన సామ్యూల్స్... మీడియా మైకులు పెట్టే బల్ల పైన కాలు మీద కాలు వేసి దర్జాగా కూర్చున్నాడు. టీవీ మైకులకు అతని కాళ్లు తాకుతున్నా పట్టించుకోలేదు. అతని ప్రవర్తన మీడియాకు ఇబ్బందిగా అనిపించింది. సామ్యూల్స్ ధోరణి, ధోనీ అసంబద్ధ ప్రశఅనలు మీడియాను అగౌరవపరిచేవని అంటున్నారు.
మీడియాతో సమావేశానికి విధిగా జట్టు మేనేజర్ తో రావాల్సిన కెప్టెన్, ఆయన లేకుండానే హాజరు కావడం, అంతకుముందు ఇయాన్ మోర్గాన్ తుది ప్రెస్ మీట్ జరుగుతుండగానే వచ్చి డయాస్ ఎక్కడం సామీ చేసిన ఓ తప్పు కాగా, ఆపై నిర్లక్ష్యపు ధోరణితో, తొలి ప్రశ్నను ఎదుర్కోకముందే కాళ్లను పైకి పెట్టడం ఏ మాత్రం సబబని సామాజిక మాధ్యమాల్లో చర్చలు సాగుతున్నాయి.