టీమిండియా యంగ్ క్రికెటర్ రింకూ సింగ్ పెళ్లి వ్యవహారానికి సంబంధించి గత మూడు నాలుగు రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఎట్టకేలకు దీనిపై ఓ స్పష్టత వచ్చేసింది. మొదటి నుంచి ప్రచారం సాగుతున్నట్లుగానే రింకూ ఉత్తర ప్రదేశ్ ఎంపీ ప్రియా సరోజ్ ను పెళ్లి చేసుకోనున్నాడు. ఇరు కుటంబాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత ఈ పెళ్లి నిశ్చయం అయిందని ఎంపీ ప్రియా తండ్రి తూఫాని సరోజ్ పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు వీరిద్దరికి నిశ్చితార్థం ఏమీ జరగలేదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.
"నిశ్చితార్థం కానీ, ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలకు గానీ ఏమీ జరగలేదు. రింకు- ప్రియా ఏడాది కాలం కన్నా ఎక్కువ రోజుల నుంచి ఒకరినొకరు బాగా తెలుసు. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కానీ ఇరు కుటుంబాల అంగీకారం దీనికి అవసరం. అయితే తాజాగా మా రెండు కుటుంబాలు ఈ పెళ్లికి ఒప్పుకున్నాం' అని ప్రియా తండ్రి తుఫాని సరోజ్ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తైన తర్వాత ఎంగేజ్మెంట్ ఉండే అవకాశం ఉందని, ఈ వేడుక లఖ్ నవూలో జరుగుతుందని వెల్లడించారు.

"రింకు ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ కు ఎంపికయ్యాడు. కాబట్టి అతడి క్రికెట్ షెడ్యూల్ పై ఎటువంటి ప్రభావం పడకుండా ఉండేలా పెళ్లి పనులను జరుపుతాం. మా రెండు కుటుంబాలు రింకు సింగ్ ఇంట్లో కలిశాయి. అక్కడే గిఫ్ట్ లు మార్చుకుని పెళ్లిని నిశ్చయించుకున్నాం." అని తూఫాని సరోజ్ చెప్పారు.
ప్రియా సరోజ్ ఎవరంటే?
ప్రియా సరోజ్(26) ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతి. దిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె రాజకీయవేత్త, న్యాయవాది. సమాజ్‌వాదీ పార్టీ తరఫున 25 ఏళ్లకే పార్లమెంటులో అడుగు పెట్టింది. అతిచిన్న వయస్సులోనే ఎంపీ అయిన యువతిగా నిలిచింది. లోక్‌సభ ఎన్నికల్లో మచ్‌లిషహర్ నియోజకవర్గం నుంచి బీజేపీ సీనియర్ లీడర్ బీపీ సరోజ్‌పై గెలిచింది. ఆమె తండ్రి, తూఫాని సరోజ్ మూడుసార్లు 1999, 2004, 2009లో ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.