భారత్-ఆస్ట్రేలియా మధ్య మెల్ బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, బాహాబాహీ సాగుతున్నాయి. అదే సమయంలో ప్రత్యర్ధి ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతీసేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా కంగారూలు వదిలిపెట్టడం లేదు. ఇలాంటిదే ఓ ఘటన ఇవాళ మెల్ బోర్న్ టెస్టు రెండో రోజు చోటు చేసుకుంది. ఇవాళ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిశాక భారత్ బ్యాటింగ్ ప్రారంభించి ఆరంభంలో వికెట్లు కోల్పోయింది. అయితే కొహ్లీ-జైశ్వాల్ ఆదుకున్నారు.
విరాట్ కొహ్లీ-యశస్వీ జైశ్వాల్ ఇద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో జైశ్వాల్ కాస్త దూకుడుగా ఆడినా విరాట్ ఆచితూచి షాట్లు కొట్టాడు. ఈ క్రమంలోనే వీరి భాగస్వామ్యాన్ని విడదీసేందుకు ఆసీస్ కెప్టెన్ కమ్మిన్స్ పదే పదే బౌలర్లను కూడా మార్చాడు.అయినా ఫలితం లేని సమయంలో ఆసీస్ యువ ఓపెనర్ శామ్ కోన్ స్టాస్ రంగంలోకి దిగాడు. అయితే బౌలింగ్ చేయకుండా ఫీల్డింగ్ చేస్తున్న కోన్ స్టాస్ భారత ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతీసే పని చేశాడు.

విరాట్ కొహ్లీ-యశస్వీ జైస్వాల్ జోడీ ఏకాగ్రత దెబ్బతీయకపోతే వికెట్ పడదని భావించిన శామ్ కోన్ స్టాస్ .. ప్రేక్షకుల గ్యాలరీకి దగ్గరగా ఫీల్టింగ్ చేస్తూ వారిని రెచ్చగొట్టాడు. నినాదాలు చేస్తూ చప్పట్లు చరిచేలా వారిని ప్రోత్సహించాడు. దీంతో ప్రేక్షకులు కూడా కోన్ స్టాస్ సూచించిన విధంగా చేతులు విసురుతూ, చప్పట్లో చరుస్తూ నినాదాలు చేశారు. కాసేపు ఇదే పరిస్ధితి కొనసాగింది.
Sam Konstas is getting the crowd involved 😅#AUSvIND pic.twitter.com/LxpxbvnPEf
— cricket.com.au (@cricketcomau) December 27, 2024
ఆ తర్వాత జైశ్వాల్ అనూహ్యంగా రనౌట్ కాగా.. అనంతరం కొహ్లీ కూడా బోలాండ్ కు చిక్కాడు. ఇదంతా చూస్తున్న వారికి మాత్రం ఆసీస్ మైండ్ గేమ్ ను జట్టులోకి కొత్తగా వచ్చిన కోన్ స్టాస్ త్వరగానే వంట బట్టించుకున్నాడుగా అనిపించింది.